We will control: రాష్ట్రాన్ని ఐడి లిక్కర్ రహితంగా తీర్చిదిద్దుతామని ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి (ఆబ్కారీ) కె.నారాయణ స్వామి స్పష్టం చేశారు. ఈ లిక్కర్ క్యాన్సర్ మాదిరిగా వ్యాపిస్తోందని, గత మూడేళ్లలో దీని నియంత్ర్రణకు ఆబ్కారీ శాఖ అధికారులు, సిబ్బందితో పాటు జిల్లా కలెక్టర్లు, ఎస్.పి.లు ఎంతో కృషిచేశారని ప్రశంసించారు. కొన్ని దురదృష్టకర పరిస్థితుల్లో కొంతమంది ఉద్యోగులను సస్పెండ్ చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఇటు వంటి చర్యలు బాధాకరంగా ఉన్నప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇలా చేయాల్సి వచ్చిందన్నారు. మద్య నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రతిపక్ష పార్టీలు సహకరించాలని కోరారు. అందరి సహకారంతో రాష్ట్రంలో ఐడి లిక్కర్ ను సమూలంగా నిర్మూలిస్తామని నారాయణస్వామి ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (ఆబ్కారీ) గా కె.నారాయణ స్వామి సోమవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. ఆబ్కారీ శాఖలో పనిచేస్తూ అనారోగ్య కారణంగా మరణించిన ఇద్దరు ఉద్యోగులకు సంబంధించిన మెడికల్ రీఇయింబర్స్ మెంట్ మంజూరు పైల్ పై ఆయన తొలి సంతకం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జగన్ ఆశీస్సులతో మళ్లీ బాధ్యతలు చేపట్టానని, అందరి సహకారంతో గత మూడేళ్లుగా ఉప ముఖ్యమంత్రి బాధ్యతలను నిర్వహించడం జరిగిందని, అదే స్పూర్తితో ఇప్పుడు కూడా సిఎం ఆశయాల సాధనకు శక్తి వంచన లేకుండా పనిచేస్తానని హామీ ఇచ్చారు.
ఛాంబరులోకి ప్రవేశించేటప్పుడు దేవుని చిత్ర పటానికి బదులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి చిత్రపటంతో ఆయన ప్రవేశించడం విశేషం. దీనిపై మీడియా ప్రశ్నించగా నిరుపేదలను, బడుగు, బలహీన వర్గాలను ఆదుకునేందుకు ఆ భగవంతుడు రామునిలా, ఏసుప్రభులా, అల్లాలా అవతారాలు ఎత్తుత్తూ ఉంటాడని, అదే తరహాలో భగవంతుని లక్షణాలు కలిగిన మన ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి నిరుపేదలను, బడుగు, బలహీన వర్గాలను ఆదుకుంటున్నాడని, అందుకే ఆయన చిత్రపటాన్ని పట్టుకుని ఛాంబరులోకి ప్రవేశించానని వివరణ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆబ్కారీ శాఖ స్పెషల్ సి.ఎస్. డా.రజత్ భార్గవ్ , ఎ.పి.స్టేట్ బెవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎం.డి. డి.వాసుదేవరెడ్డి తదితరులతో పాటు ఆబ్కారీ శాఖకు చెందిన పలువురు అధికారులు, అనధికారులు పాల్గొని నారాయణస్వామికి అభినందలు తెలిపారు.
Also Read : జగన్ సామాజిక విప్లవవాది: జోగి రమేష్