Friday, March 29, 2024
HomeTrending Newsవిద్యుత్ కొరత త్వరలో అధిగమిస్తాం: పెద్దిరెడ్డి

విద్యుత్ కొరత త్వరలో అధిగమిస్తాం: పెద్దిరెడ్డి

shortly overcome: రాష్ట్రంలో మరో  రెండు థర్మల్ కేంద్రాల నుంచి అదనంగా 1600 మెగావాట్ల ఉత్పత్తి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వెల్లడించారు.  ప్రస్తుతం నెలకొన్న విద్యుత్ కొరత తాత్కాలికమేనని,  మే ఒకటి నుండి విద్యుత్ సరఫరా సాధారణ స్థితికి చేరుకుంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని  విద్యుత్ సరఫరాపై  ఏపీ జెన్ కో, ఎపి ట్రాన్స్ కో నెడ్ క్యాప్, ఏపీఎస్ఈసిఎంల అధికారులతో రాష్ట్ర సచివాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణపట్నంలో మరో నెలలో 800 మెగావాట్లు,  నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీటీపీఎస్)లో మరో మూడు, నాలుగు  నెలల్లో 800 మెగావాట్ల ఉత్పత్తి  ప్రారంభమవుతుందని తెలిపారు. కృష్ణపట్నం యూనిట్ ను వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇది కాక కొత్తగా మరో 6000 మెగావాట్ల హైడెల్ ( పంప్డ్ హైడ్రో స్టోరేజీ ) సామర్థ్యం గల విద్యుత్ ఉత్పత్తి  ప్లాంట్లను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్దం చేశామన్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం రోజువారీ డిమాండ్ 235 మిలియన్ యూనిట్లు ఉండగా కేవలం 150 మిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రమే అందుబాటులో ఉందన్నారు. దీనివల్ల రోజుకు 85 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ కొరత ఏర్పడిందన్నారు. ప్రస్తుతం దీనిలో 30 మిలియన్  యూనిట్ల  మేర విద్యుత్ ను విద్యుత్ ఎక్స్ఛేంజీల నుంచి సమకూర్చుకుంటున్నట్లు చెప్పారు. విద్యుత్ ఎక్స్ఛేంజీలలోను డిమాండ్, సప్లై ల మధ్య భారీగా అంతరం ఉండటం వల్ల ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు సిద్దంగా ఉన్నప్పటికీ విద్యుత్ లభ్యత లేక సాధ్యపడటం లేదని అన్నారు. దేశంలో తీవ్రమైన బొగ్గు కొరత వల్ల  కొన్ని థర్మల్ ప్లాంట్లు మూతబడ్డాయన్నారు.

భవిష్యత్ లోనూ 24 గంటలపాటు నిరంతరాయ విద్యుత్ ను కొనసాగించాలనేదే  ప్రభుత్వ లక్ష్యమని, ప్రస్తుత సమస్య  కేవలం బొగ్గు కొరత వలనే ఏర్పడిందని తెలిపారు.  తమ  ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి విద్యుత్ రంగం తీవ్ర ఒడుదుడుకులు ఎదుర్కుంటోందని, విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టేందుకు సీఎం జగన్ ముందుచూపుతో కట్టుదిట్టమైన చర్యలు ప్రారంభించారని తెలిపారు.

మన రాష్ట్రంలో విద్యుత్ సరఫరాపై మాట్లాడుతున్నవారు  గతంలో అధికారంలో ఉన్న సమయంలో విద్యుత్ రంగాన్ని ఏ విధంగా కొనసాగించారో, రైతులు ఉద్యమాలు చేసిన సమయంలో కాల్పులు జరిపి ముగ్గురిని పొట్టన పెట్టుకున్న ఉదంతాలను మరిచిపోయారా అని ప్రశ్నించారు. జగన్ పాలనలో అటువంటి పరిస్థితులు ఎన్నడూ ఉత్పన్నం కావని, సమర్థవంతంగా విద్యుత్ ఉత్పత్తి, సరఫరాలపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు దృష్టి సారించి, నిర్ణయాలు తీసుకుంటోందని అన్నారు.

ఇంధన కార్యదర్శి బి.శ్రీధర్, ఎపి ట్రాన్స్ కో జెఎండి ఐ.పృథ్వితేజ్, నెడ్ క్యాప్ ఎండి ఎస్ రమణా రెడ్డి తదితరులు పాల్గొని విద్యుత్ రంగంలో అమలు చేస్తున్న కార్యకలాపాలను మంత్రికి వివరించారు.

Also Read : బొగ్గు కొరతతో కరెంట్ కోతలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్