మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన మహారాష్ట్ర మంత్రి, ఎన్‌సీపీ నేత నవాబ్ మాలిక్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. దర్యాప్తు ప్రారంభ దశలో ఉందని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. ఈ దశలో న్యాయ ప్రక్రియలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సంబంధంగల ఓ కేసులో ఫిబ్రవరిలో నవాబ్ మాలిక్ అరెస్టయ్యారు. తనను జైలు నుంచి విడుదల చేయాలని కోరుతూ నవాబ్ మాలిక్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ఇటీవల బోంబే హైకోర్టు కూడా తిరస్కరించింది.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం 5,000 పేజీల ఛార్జిషీటును ముంబై కోర్టుకు సమర్పించింది. డాక్యుమెంట్లను తనిఖీ చేసిన తర్వాత మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం నేరాలను విచారించే ప్రత్యేక కోర్టు ఈ ఛార్జిషీటును విచారణకు స్వీకరిస్తుంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) ప్రకారం దావూద్ ఇబ్రహీంతోపాటు మరికొందరిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) నమోదు చేసిన కేసు ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈ కేసును నమోదు చేసింది.
ఓ ఆస్తిని చట్టవిరుద్ధంగా స్వాధీనం చేసుకోవడం కోసం దావూద్ గ్యాంగ్ సభ్యునికి నవాబ్ మాలిక్ నిధులు సమకూర్చినట్లు ఆరోపించింది. మాలిక్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన ఎనిమిది ఆస్తులను గత వారం జప్తు చేసింది. నవాబ్ మాలిక్ తరపున సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. 1999లో జరిగిన నేరానికి 2022 ఫిబ్రవరిలో నవాబ్ మాలిక్‌ను అరెస్టు చేయడం చెల్లుబాటవుతుందా? అని ప్రశ్నించారు.
దీనిపై జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పందిస్తూ, ఇది ప్రారంభ దశ అని, తాము ఈ దశలో జోక్యం చేసుకోవడం సరైనది కాదని చెప్పారు. ట్రయల్ కోర్టులో బెయిలు కోసం దరఖాస్తు చేయవచ్చునని తెలిపారు.
Also Read : మహారాష్ట్రలో మనీ లాండరింగ్ రాజకీయం