జమ్ముకశ్మీర్ లో రేపు ప్రధాని నరేంద్రమోడీ పర్యటించనున్నారు. పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా జమ్ములోని సంబా జిల్లా పల్లీ గ్రామంలోజరిగే కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. పల్లీ గ్రామం నుంచే గ్రామీణ స్థానిక సంస్థలను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. ప్రతి ఏడాది ఏప్రిల్ 24వ తేదిని జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ప్రధాని పర్యటనకు ముందు జమ్ముకశ్మీర్ లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే లక్ష్యంగా కొన్నిరోజులుగా కొనసాగుతున్న ఉగ్రదాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఐదుగురు సర్పంచ్ లు హత్యకు గురయ్యారు.
నరేంద్ర మోడీ ప్రధాని అయినప్పటి నుంచి జమ్మూ కశ్మీర్ పై ప్రత్యేక దృష్టి సారించారు. … 2019 ఆగస్టులో 370 ఆర్టికల్ ను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం జమ్ముకశ్మీర్ కు రాష్ట్ర హోదాను తొలగించింది. జమ్ముకశ్మీర్, లడక్ ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత లోయలో ప్రధాని మోడీ పర్యటించడం ఇదే తొలిసారి. 2019, 2021లో జమ్ముకశ్మీర్ కు వెళ్లినా.. సరిహద్దుల్లో సైనిక బలగాలతో దీపావళి వేడుకలకే పరిమితమయ్యారు. ఈసారి ప్రజాప్రతినిధులతో, ప్రజలతో ప్రధాని నేరుగా సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా 32 వేల కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు.
Also Read : ఆర్టికల్ 370 రద్దుతో అందరికి అధికారం