రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఈ రోజు వేకువ జామునే హైదరాబాద్ నగరంలో కుండపోతగా వర్షం పడింది. కొద్దిరోజులుగా ఉక్కపోతతో సతమతమవుతున్న నగరవాసులకు ఈ రోజు వర్షంతో కొంత ఉపశమనం లభించినట్టయింది. వర్షం ధాటికి షరామాములుగా నగరంలో రోడ్లు జలమయం అయ్యాయి. అటు నల్లగొండ, సిద్దిపేట, జగిత్యాల జిల్లాల్లో పిడుగులు పడటంతో ఇద్దరు మరణించగా, రెండు కాడెద్దులు, 43 మేకలు మృతిచెందాయి. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం మోదినిగూడెంలో పిడుగుపాటుకు లింస్వామి అనే వ్యక్తి మృతిచెందాడు. అదేవిధంగా సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక మండలం నరేండ్లగడ్లలో పిడుగుపడి రైతు మరణించాడు. ధాన్యంపై టార్పాలిన్ కప్పుతుండగా పిడుగుపడి పోచయ్య మృతిచెందగా, మరో రైతు తీవ్రంగా గాయపడ్డాడు.
మద్దూరు మండలంలోని వంగపల్లిలో ఎర్రబచ్చల బిక్షపతి అనే రైతుకు చెందిన రెండు కాడెద్దులు పిడుగుపాటుకు మరణించాయి. వీటివిలువ సుమారు రూ.లక్షా 50 వేలు ఉంటుందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక జగిత్యాల మండలం బల్వంతాపూర్‌లో పిడుగుపడి ఇద్దరు గాయపడగా, 43 మేకలు మృతిచెందాయి.