High Alert : జమ్ముకశ్మీర్ లో హై అలెర్ట్ ప్రకటించారు. ఆర్మీ తనిఖీల్లో జమ్ములోని సాంబ సెక్టార్ లో ఓ సొరంగం బయటపడింది. పాకిస్తాన్ సరిహద్దులకు దగ్గరగా ఉన్న ఈ ప్రాంతంలో సొరంగం బయల్పడటంతో ప్రభుత్వం అన్ని శాఖల్ని అప్రమత్తం చేసింది. సొరంగాన్ని మూసివేసిన సైన్యాధికారులు విచారణకు ఆదేశించారు. అంతర్జాతీయ సరిహద్దులకు 150 మీటర్ల దూరంలోనే… జనావాస ప్రాంతాలకు దగ్గరలోనే టన్నెల్ వెలుగు చూడటం వెనుక పెద్ద కుట్ర ఉండొచ్చని బి.ఎస్.ఎఫ్ అధికారులు అనుమానిస్తున్నారు. పాకిస్తాన్ నుంచి ఆత్మాహుతి దళాలు భారత్ లోకి ప్రవేశించి ఉండొచ్చని జాతీయ దర్యాప్తు సంస్థలు అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేశాయి.
గత నెల 22 వ తేదిన జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులని మట్టుబెట్టిన భద్రతా దళాలు వారి దగ్గర దొరికిన సమాచారం ఆధారంగా విచారణ చేపట్టాయి. జమ్ములోని సున్జవాన్ ప్రాంతంలో ఎన్ కౌంటర్ జరగగా ఉగ్రవాదులు వాడిన వాహనం సోనోవాల్ దగ్గర దొరికింది. సొరంగం బయటపడిన ప్రాంతానికి సోనోవాల్ దగ్గరగా ఉండటంతో వారు ఈ మార్గం ద్వారానే వచ్చారా అనే కోణంలో నిఘా వర్గాలు విచారణ చేపట్టాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జమ్ము పర్యటనకు ముందే ఉగ్రవాదులను మట్టుపెట్టినా.. అప్పుడు సొరంగం బయట పడలేదు. ఈ మార్గం ద్వారా ఎంత మంది వచ్చారు,ఏం చేయబోతున్నారనే దానిపై విచారణ జరుపుతున్నామని జమ్ము కాశ్మీర్ డిజిపి దిల్భాగ్ సింగ్ ప్రకటించారు.