Roar Vs. Sivir: ఒక్కోసారి కొన్ని విషయాలను విడివిడిగా కాకుండా కలిపి చదువుకుంటే ఎన్నెన్నో అర్థం కాని విషయాలు వాటంతట అవే అర్థమైపోతూ ఉంటాయి. అలా ఈరోజు రెండు ప్రధాన వార్తలను విడివిడిగా కాకుండా కలిపి చదువుకుంటే చాలు. పాలకు పాలు…నీళ్లకు నీళ్లలా తెలిసిపోతాయి.
ఆ వార్తలు:-
1. రెండుసార్లు పదవిలో ఉన్నాను కాబట్టి ఇక చాలు అనుకోను. ముచ్చటగా మూడోసారీ ఉంటా...అన్నీ అనుకూలిస్తే నాలుగోసారీ ఉంటా అని భారత ప్రధాని మోడీ మన్ కీ బాత్.
2. దేశాన్ని దశాబ్దాలపాటు నిర్నిరోధంగా పాలించిన కాంగ్రెస్ తను ఎక్కడుందో? ఎటు వెళ్లాలో? ఎటు వెళ్లకూడదో? ఎవరితో కలవాలో? ఎవరిని కలవకూడదో? తెలుసుకోవడానికి, చింతించడానికి ఉదయ్ పూర్ లో మూడు రోజులు చింతన్ బైఠక్ నిర్వహించడం.
మాట ఒకటే అయినా భాషను బట్టి అర్థం మారిపోతూ ఉంటుంది.
మన అవసరం- నెసెసిటి;
హిందీ అవసర్- సందర్భం.
మన తీరు- పధ్ధతి;
కన్నడ తీరు- చనిపోవడం.
అలాగే మాట ఒకటే అయినా వేదాంత భాషకు, మామూలు భాషకు అర్థాలు వేరే ఉంటాయి. ఉదాహరణ చింత. తెలుగులో చింత అంటే చెట్టు, ఆలోచన, చింతించడం, విచారించడం, బాధ. ఇందులో చెట్టు తప్ప మిగతా చింతితార్థాల చింతలన్నీ సంస్కృతానివే. తెలుగులో బాధపడాల్సిన చింత లేదనుకుని నిశ్చింతగా ఉండవచ్చు. సంస్కృతాంధ్రాల్లో వేదాంత చింత చాలా పెద్ద సబ్జెక్ట్. ఆ సంస్కృత చింత హిందీ భాషలోకి వచ్చేసరికి హిందీకి సహజమయిన చివరి పొల్లు “న్” చేరి “చింతన్” అవుతుంది.
“చక్రిచింత లేని జన్మంబు జన్మమే?
తరళసలిలబుద్బుదంబు గాక;
విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుఁడే?
పాదయుగముతోడి పశువు గాక?”
…అని పోతన పోతపోసిన ప్రహ్లాదుడిది భాగవత చింత.
మనది బతుకు చింత. సంసార చింత.
అలా రాజకీయ పార్టీలది ఎన్నికల చింత. గెలుపోటముల చింత. అధికారంలో ఉన్నవారికి అధికారం పోతుందేమోనన్న చింత. అధికారంలో లేనివారికి అధికారంలోకి రావాలన్న చింత. నిధుల చింత. నిర్వహణ చింత. మనుగడ చింత.
చింత చచ్చినా పులుపు చావదు. కాబట్టి అధికారం పులుపు రుచి మరిగిన తరువాత మలుపు మలుపులో పదవి పిలుపులే పుల్ల పుల్లగా వినిపిస్తూ ఉంటాయి. కడుపులో కాయ పడగానే పుల్లగా ఏదయినా తినాలనిపించడం ప్రకృతి ధర్మం. పార్టీ పెట్టగానే పదవి చింత పుల్లగా మనసుకు తగలడం కూడా ప్రకృతి ధర్మమే.
చింత చిగురు పచ్చడి, చింతకాయల పచ్చడి, చింత చిగురు పప్పు, చింత చారు, చింత పులుసు, సీమ చింత, చింత కర్ర, చింత పిక్కలాట, చింతాకు…ఇలా మన బతుకుతో చింతది విడదీయరాని చింతానుబంధం.
అఖిల భారత కాంగ్రెస్ ఉదయ్ పూర్ చింతన్ బైఠక్ లో కూడా అణువణువునా చింతే ఉన్నా...చింత పులుసు, చారు, పచ్చళ్లు, చింతపిక్కలాటలు ఉండకపోవచ్చు. లిటరల్ జస్టిఫికేషన్ ఉంటుందని సింబాలిక్ గా ఒకవేళ ఉన్నా ఉండవచ్చు. ఉదయ్ పూర్ పేరుకు తగ్గట్టు కాంగ్రెస్ కు అక్కడ కొత్త ఉదయం కనబడి…వెలుగుల దారిలో పార్టీ నడవాలని చింతించడం తప్ప మనం చేయగలిగింది లేదు.
కాంగ్రెస్ ది నైరాశ్య చింత.
ప్రధాని మోడీది మహోత్సాహోద్భూత నిశ్చింత. రెండుసార్లు ప్రధానిగా చేశాక…మూడోసారి ఎందుకు? అన్న వైరాగ్యం తనలో లేదని…ఆ ఉరిమే ఉత్సాహాన్ని తనను కన్న గుజరాత్ గడ్డ ఇచ్చిందని…గుజరాత్ నేల మీద భావోద్విగ్నంగా చెప్పారు.
అమెరికాలోలా రెండుసార్లకు మించి పదవిలో ఉండడానికి వీల్లేదని మనదగ్గర రాజ్యాంగపరమయిన అడ్డంకులేమీ లేవు కాబట్టి…మూడో సారితోనే మోడీ సరిపెట్టుకోవాల్సిన పనిలేదు. నాలుగు…అయిదు…ఎన్నిసార్లయినా పదవిలో అదే ఉత్సాహంతో ఉండవచ్చు- జనం గెలిపిస్తే.
భాయీయో! ఔర్ బెహనో! మీకు-
చిటికెడు ఉరిమే ఉత్సాహం కావాలా?
కడివెడు కదిలే చైతన్యం కావాలా?
బండెడు పదవిలో బిగుసుకుపోయే బిగింపు కావాలా?
అయితే-
మూడురోజులు గుజరాత్ మట్టిలో దొర్లి రండి.
రెండ్రోజులు గుజరాత్ నీళ్లు తాగి రండి.
ఒక్క రోజు గుజరాత్ గాలి పీల్చి రండి.
మీ చింతలన్నీ మాయం.
నిశ్చింత మీ సొంతం.
గుప్పెడు ఉప్పును రాజేసి…
నిప్పుల ఉప్పెనగా చేసి…
దండి యాత్రనే దండ యాత్రగా చేసిన నేల అది. ఆ నేల మహిమకు మనం పొంగిపోవాలే తప్ప…అసూయ పడితే మన ఆరోగ్యాలకే మంచిది కాదు.
-పమిడికాల్వ మధుసూదన్
ఇవి కూడా చదవండి:
ఇవి కూడా చదవండి: