Crystal Clear:
ఒక్కటి మిస్సయ్యేది..
కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ ఒక్కటి మిస్సయ్యేది.
సభలు, సమావేశాలు ఎన్ని జరిగినా.. ఆ ఒక్కటి ఎప్పుడూ మిస్సయ్యేది..
ఉపన్యాసాలు, ప్రసంగాలు ఎన్ని ఇచ్చినా.. అదెప్పుడూ మిస్సింగే.
ఎన్ని సంక్షోభాలొచ్చినా, సమస్యలొచ్చినా..
ఆ ఒక్కటీ లేకుండా నెట్టుకురావడం కాంగ్రెస్ స్టైల్..
కానీ, ఈసారి రాహూల్ వరంగల్ మీటింగ్ లో ఆ ఒక్కటీ మిస్ కాలేదు.
పైగా కొట్టొచ్చినట్టు కనిపించింది.
అదే క్లారిటీ.

Rahul Gandhi Clarity
ఢిల్లీ నుంచి పల్లె వరరకు కాంగ్రెస్ అంటేనే..
అనేక అధికార కేంద్రాలు.
ఎవరి వాదన వాళ్ళకుంటుంది.
ఎవరి వర్గం వాళ్ళకుంటుంది.
ఎవరి పవర్ వాళ్ళకుంటుంది.
ఎవరి ప్రాభవం వాళ్ళకుంటుంది.
హైకమాండ్ అన్నీ చూస్తుంటుందే తప్ప..
దేన్నీ ఖండించదు..
దేన్నీ ఆమోదించదు.
ఏదీ తేల్చదు..
ఏదీ ముంచదు.
ఈ ధోరణే కాంగ్రెస్ బలం.
కాంగ్రెస్ బలహీనత కూడా.
ఈ మధ్య బలం ఎక్కడా కనిపించడం లేదు కాబట్టీ.. బలహీనత పాళ్లే ఎక్కువైంది.
ఢిల్లీలోనే జీ23 పేరుతో సీనియర్ల ఎంత నసపెడుతున్నా.. హైకమాండ్ కిమ్మనదు.
మాటల్లోనూ, చేతల్లోనూ సమాధానం ఏముండదు.
చర్చలు మాత్రం జరుగుతాయి.
నిర్ణయాలుండవు.
ఇక రాష్ట్రాల్లో కూడా అంతే.
కాంగ్రెస్ అంటేనే కలగూర గంప.
కలహాల కొంప.
ఈ కంగాళీ కాంపిటీషన్ లోనే నేతలు వస్తుంటారు, పోతుంటారు.
ఈసారి రాహూల్ వచ్చారు.
అయితే, ఎప్పట్లా వెళ్ళలేదు..

నిజానికి ఇటు కాంగ్రెస్ లోనూ, అటు రాజకీయాల్లోనూ రాహూల్ శైలి ప్రత్యేకం..
మంచి చెడ్డలని నిర్ణయించేది గెలుపోటములే కాబట్టీ,
రాహూల్ తరహా రాజకీయాలకు ఇప్పుడు క్రేజ్ లేకపోవచ్చు.
కానీ, ఆయన మాత్రం మారలేదు.
చిల్లర మల్లర విషయాలపై స్పందించరు.
వ్యక్తులను పెద్దగా టార్గెట్ చేయలేదు.
వ్యక్తిగత విషయాలు మాట్లాడరు.
చివరికి తన వ్యక్తిగత విషయాలమీద వచ్చిన విమర్శలకు కూడా స్పందన వుండదు.
ఈ సభకి రెండు రోజుల ముందు రాహూల్ నేపాల్ టూర్ మీద పెద్ద దుమారమే రేగింది.
మరే ఇతర నేత అయినా, పరోక్షంగా అయినా ఆ అంశాన్ని ప్రస్తావించే అవకాశం వుండేది.
నిజానికి ఆ విషయంలో,  విమర్శల్లో పసలేదని తేలిపోయింది.
అయినా, ఈ వేదికను తనకి తాను క్లీన్ చిట్ ఇచ్చుకోవడానికి రాహూల్ వాడుకోలేదు.
పూర్తిగా తెలంగాణకు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీకే పరిమితం చేశారు.

మూడే మూడు విషయాలు
టీ ఆర్ ఎస్ తో పొత్తు వుండదు.
టీ ఆర్ ఎస్ తో లోపాయికారి స్నేహం చేసే నేతల్ని బయటికి పంపేస్తాం.
సీనియారిటీకి, ఎమ్మెల్యే టిక్కెట్లకి సంబంధం లేదు.
ఈ మూడు విషయాలను రెండు వేదికలమీద కుండబద్దలు కొట్టారు.
కాంగ్రెస్ వ్యవహారాల్లో ఇది అరుదైన విషయమే.
కానీ, ఇది రాహూల్ తోనే సాధ్యం.

గెలవడం ఒక్కటే లక్ష్యం..
ఆ లక్ష్యం దిశగా పరిగెట్టేవాళ్ళు పరిగెడతారు.
పడిపోయేవాళ్ళు పడిపోతారు.
రాహూల్ గాంధీ తెలంగాణకి రావడానికి రెండు రోజుల ముందు రేవంత్ చెప్పిన మాటలివి.
వీటినే రాహూల్ మరో రకంగా చెప్పారు.
జనంలో వుంటేనే గెలుస్తారు.
జనంలో వున్న వాళ్ళనే పార్టీ పట్టించుకుంటుంది.

Rahul Gandhi Clarity
సీనియర్లు గీనియర్లు జాన్తానై..అని తేల్చేశారు.
నిజానికి ఇప్పుడు దేశంలో కాంగ్రెస్ కు ఆశలు పెట్టుకోగలిగిన ఒకటి రెండు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి.
అందుకే రాహూల్ గాంధీకి మొదటి నుంచి ఈ రాష్ట్రం మీద ప్రత్యేక దృష్టి వుంది.
రేవంత్ ని కాంగ్రెస్ లోకి తీసుకోవడమే సోకాల్డ్ సీనియర్లకు ఒక సందేశం.
పిసిసి అధ్యక్షుడిని చేయడం అంతకు మించిన క్లారిటీ.
వరంగల్ సభలో ఏకంగా వుంటారో పోతారో తేల్చుకోండి అనేశారు.
ఒక రకంగా.. రేవంత్ గొంతునే రాహూల్ కూడా వినిపించారు.
అయితే, ఎన్నేళ్ళు ఉతికితే ఎలుకతోలు తెల్లగవుతుంది?
ఎన్ని క్లారిటీలు ఇస్తే, కాంగ్రెస్ లో మార్పొస్తుంది?

-శైలి

Also Read : 

నేపాల్ నైట్ క్లబ్ ఎఫెక్ట్

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *