మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వేటగాళ్లు రెచ్చిపోయారు.. అడవిలో జింకలను వేటాడేందుకు వచ్చి.. అడ్డొచ్చిన పోలీసుల ప్రాణాలు బలిగొన్నారు. మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో కృష్ణ జింకల వేటగాళ్లు ఈ రోజు తెల్లవారుజామున ముగ్గురు పోలీసులను కాల్చి చంపారు. గుణ అడవుల్లో ఈ ఘటన జరిగింది. దుర్ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఇవాళ ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులపై వేటగాళ్లు ఫైరింగ్ జరిపినట్లు గుణ జిల్లా ఎస్పీ రాజీవ్ మిశ్రా వెల్లడించారు. వేటగాళ్ల వద్ద తుపాకులు ఉన్నాయని, మోటారు బైక్‌పై వచ్చిన వేటగాళ్లు.. పోలీసు టీమ్‌పై కాల్పులు జరిపినట్లు ఎస్పీ వివరించారు.
పోలీసులు ఎదురుదాడి చేసినా ఫలితం లేకపోయిందని, వేటగాళ్లు అక్కడ నుంచి పారిపోయారని, ఈ దాడిలో ఎస్సై రాజ్‌కుమార్ జత్వా, హెడ్ కానిస్టేబుల్ సంత్ కుమార్ మీనా, కానిస్టేబుల్ నీరజ్ భార్గవ్‌లు ప్రాణాలు కోల్పోయినట్లు ఎస్పీ వెల్లడించారు. పోలీసు వాహనం నడుపుతున్న డ్రైవర్ దాడిలో గాయపడ్డాడు. కృష్ణ జింకల కోసం కొందరు వేటగాళ్లు అడవికి వచ్చినట్లు సమాచారం రావడంతో అక్కడికి పోలీసులు వెళ్లారు. అటవీ ప్రాంతం నుంచి కృష్ణ జింకల శరీరా భాగాలను పోలీసులు సేకరించారు.
Also Read : ముండ్కా ఘటనలో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు