No Rise: సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ ఏడాది కూడా అభిమానులను తీవ్రంగా నిరాశపరిచి ప్లే ఆఫ్ కు దాదాపు దూరమైంది. గత ఏడాది చివరి స్థానంలో నిలిచిన జట్టు ఈ ఏడాది విజేత కాకపోయినా కనీసం టాప్ 4 లో అయినా స్థానం దక్కించుకుంటుందని అందరూ ఆశించారు. కానీ వారి ఆశలు నెరవేరలేదు.
నేడు కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో 54 పరుగుల తేడాతో హైదరాబాద్ ఓటమి పాలైంది, 178 పరుగుల లక్ష్య ఛేదనలో విఫలమై 20 ఓవర్లలో 8 వికెట్లకు 123 పరుగులు చేసింది. కోల్ కతా ఆటగాడు ఆండ్రీ రస్సెల్ ఆల్ రౌండ్ ప్రతిభతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో కోల్ కతా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. జట్టు స్కోరు 17వద్ద ఓపెనర్ వెంకటేష్ అయ్యర్ (7) వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత నితీష్ రానా-26; రేహానే-28; కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్-15; రింకూ సింగ్-5 పరుగులు చేసి ఔటయ్యారు. ఈ దశలో శామ్ బిల్లింగ్స్- ఆండ్రీ రస్సెల్ కలిసి ఆరో వికెట్ కు 63 పరుగులు జోడించారు. బిల్లింగ్స్ 29 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్ తో 34 పరుగులు చేసి వెనుదిరగగా, రస్సెల్ చాలా కాలం తర్వాత ఓ మంచి ఇన్నింగ్స్ ఆడాడు, 28 బంతుల్లో 3ఫోర్లు, 4 సిక్సర్లతో 49 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. కోల్ కతా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ మూడు, భువీ, మార్కో జాన్సేన్, నటరాజన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
హైదరాబాద్ 30 పరుగులకు తొలి వికెట్ కోల్పోయింది, 17 బంతులు ఎదుర్కొన్న కెప్టెన్ కేన్ విలియమ్సన్ 9 పరుగులు చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ ఒక్కడే 43 పరుగులతో జట్టులో అత్యధిక స్కోరర్ గా నిలిచాడు. మార్ క్రమ్ 35 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. మిగిలిన బ్యాట్స్ మెన్…. రాహూల్ త్రిపాఠి-9; నికోలస్ పూరన్-2; వాషింగ్టన్ సుందర్-4; శశాంక్ సింగ్-11; మార్కో జేన్సేన్ -1 లు విఫలమయ్యారు.
ఆండ్రీ రస్సెల్ మూడు; టిమ్ సౌతీ రెండు; ఉమేష్ యాదవ్, సునీల్ నరేన్, వరుణ్ చక్రవర్తి తలా ఒక వికెట్ పడగొట్టారు.
ఆండ్రీ రస్సెల్ కే ‘మ్యాన్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.