We will fight: తెలుగుజాతి ఉన్నంతవరకూ తెలుగుదేశం పార్టీ ఉంటుందని, ప్రజలకోసం పోరాటం చేస్తుందని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు భరోసా ఇచ్చారు. ఉమ్మడి కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, అరాచకం రాజ్యమేలుతోందని, ఆడబిడ్డలపై అత్యాచారాలు ఆవేదన కలిగిస్తున్నాయని చెప్పారు. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై పోరాడేవారికి తాము అండగా ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ ప్రభుత్వం వేస్తున్న పన్నులతో ప్రజలు బాధతో అల్లాడుతున్నారని అందుకే తాము ‘బాదుడే బాదుడు’ కార్యక్రమం చేపట్టామని వెల్లడించారు.
రాజ్య సభ సీట్లు అమ్ముకునే పరిస్థితికి వచ్చారని బాబు విమర్శించారు. నాడు తెలుగుజాతి ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించారని, ఇప్పుడు కూడా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు మన గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తమ పార్టీ కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్నారని, ప్రాణాలు అర్పించైనా కార్యకర్తలను కాపాడుకుంటామని చెప్పారు. తనపై కూడా కేసులు పెడుతున్నారని, తప్పుడు కేసులకు భయపడేది లేదని, ఎవరెన్ని కుట్రలు చేసినా తనను ఎవ్వరూ ఏమీ చేయలేరని, తాము కన్నెర్ర చేస్తే మసైపోతారంటూ హెచ్చరించారు. ఈ ప్రభుత్వం చేసిన తప్పులు ఒప్పుకొని సరిదిద్దాలని, లేకపోతే మనరాష్ట్రం కూడా మరో శ్రీలంక అవుతుందని బాబు స్పష్టం చేశారు. అధికారం తనకు కొత్త కాదని, ఆంధ్ర ప్రదేశ్ ను అభివృద్ధి పథంలో నడిపించి 2029 నాటికి దేశంలోనే మొదటి స్థానంలో ఉంచాలనిఆలోచించానని చంద్రబాబు చెప్పారు.
రాష్ట్రంలో ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని, ధైర్యంగా పోరాటం చేసి ఈ ప్రభుత్వాన్ని సాగనంపి మళ్ళీ టిడిపి ప్రభుత్వాన్ని తెచ్చుకొని రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసుకుందామని పిలుపు ఇచ్చారు.
Also Read : ఏపీలో అర్హులు లేరా? : చంద్రబాబు ప్రశ్న