We Won’t Spare: తాము అధికారంలోకి వచ్చాక భూ కబ్జాదారుల అంతు చూస్తామని టిడిపి అధినేత చంద్రబాబు హెచ్చరించారు. వైసీపీ రౌడీయిజంతో పాలన సాగిస్తోందని, ఇలాంటి పార్టీని బంగాళాఖాతంలో కలపాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు. ప్రజలపై పన్నుల పేరుతో బాదుతున్నారని అందుకే బాదుడే బాదుడు కార్యక్రమం చేపట్టామని చెప్పారు. ఈ ప్రభుత్వం చేస్తున్నది తప్పు అని సలహా ఇస్తున్న అధికారులు సిఎం జగన్ ను నచ్చడంలేదన్నారు. జీవితంలో ఎప్పుడూ చూడని ఉత్సాహం తన రాష్ట్రవ్యాప్త పర్యటనలో కార్యకర్తల్లో చూస్తున్నానని వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లా పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. బాదుడే బాదుడు కార్యక్రమాన్ని శ్రీకాకుళంలో ప్రారంభించామని, నిన్న కర్నూలు జిల్లాలో బుగ్గన నియోజక వర్గంలో ప్రజలు చూపిన ఆదరణ బ్రహ్మాండంగా ఉందన్నారు. అధికార పార్టీ నేతలు రాష్ట్రాన్ని కల్తీ సారా, గంజాయి మాఫియాకు అడ్డాగా మార్చేశారని విమర్శించారు. వైసీపీ నేతల బెదిరింపుల వల్లే ఈ జిల్లా నుంచి నుంచి జాకీ పరిశ్రమ వెళ్ళిపోయిందన్నారు.
ఈ జిల్లా పార్టీకి కంచుకోట లాంటిదని, ఎన్టీఆర్ కు కూడా ఈ జిల్లా అంటే ఎనలేని ప్రేమ ఉందని, అందుకే అయన సొంత నియోజకవర్గం గుడివాడ వదిలి పెట్టి హిందూపురం ఎంచుకున్నారని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే పెద్ద సంపద అని బాబు అన్నారు, కష్ట కాలంలో పార్టీ జెండా మోసిన వారికి, పనిచేసే కార్యకర్తలకే గుర్తింపు ఉంటుందని బాబు భరోసా ఇచ్చారు. పార్టీలో అధికారంలోకి వచ్చిన తర్వాత చేరేందుకు కొందరు వలస పక్షులు సిద్ధంగా ఉంటారని వ్యాఖ్యానించారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉంటామన్నారు. పార్టీ నేతలు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
Also Read : ఏపీలో అర్హులు లేరా? : చంద్రబాబు ప్రశ్న