‘Daughter of Ganga’: Newborn girl found in wooden box floating in river
ఏ తల్లి పాడేను జోల?
ఏ తల్లి ఊపేను డోల?
ఎవరికి నీవు కావాలి?
ఎవరికి నీ మీద జాలి?
…తెలియక చేసిన తప్పు చేతుల్లో బిడ్డగా దర్శనం ఇచ్చినపుడు ఆత్మహత్యే శరణ్యమని కుంతీదేవి గంగానదిని ఆశ్రయించగా ఒక పెట్టె తేలుతూ వచ్చిందట. ఈశ్వరేచ్ఛ అనుకుని పెట్టెలో పూలు, ఆకులతో మెత్తగా చేసి బిడ్డని పడుకోబెట్టి తన పరిస్థితికి బాధ పడుతూ బిడ్డను ఎవరన్నా చేరదీస్తారో లేదో అని చింతిస్తూ వదలలేక
వదిలిందని కరుణశ్రీ కుంతీవిలాపంలో హృదయం ద్రవించేలా వర్ణించారు.
ఈ కలియుగంలో కూడా తెలిసో తెలియకో తప్పుచేసి పిల్లల్ని వదిలించుకునేవారు ఎక్కువే. అయితే తాజాగా ఓ తల్లి కుంతీదేవి మార్గాన్నే ఎంచుకుంది.
ఉత్తరప్రదేశ్ లో ఘాజీపూర్ దగ్గర గంగానది దీనికి సాక్ష్యం. జూన్ 14 వ తేదీన గుల్లు చౌదరి తన పడవతో దాద్రి ఘాట్ వెళ్ళాడు. ఎక్కడినుంచో పసిబిడ్డ ఏడుపు వినిపిస్తోంది. ఇంకా చాలా మందికి వినిపించిందా ఏడుపు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. గుల్లు మాత్రం బిడ్డకోసం వెతికాడు. నీళ్లపై తేలుతున్న ఒక చెక్క పెట్టె నుంచి ఆ శబ్దం వస్తోందని గ్రహించాడు. పెట్టె తీసుకొచ్చి మూత తీశాడు. ముద్దులు మూటగట్టే 21 రోజుల ఆడబిడ్డ కనిపించింది. చక్కగా బట్టలో చుట్టి, పాప జాతక చక్రంతో సహా అందులో పెట్టారు. పాపకు రక్షణగా కాబోలు దేవతల పటాలు ఉన్నాయి. ‘గంగమ్మ కూతురు’ అనే నోట్ కూడా దొరికింది. ఆనాడు రాధేయుడికి కర్ణుడు, కణ్వుడికి శకుంతల లానే తనకు దొరికిన పాపను పెంచుకుందామని గుల్లు అనుకున్నాడు….
Newborn girl found in wooden box floating in river :
ఇంతలో ఈ సంఘటన తాలూకు వీడియోలు వైరల్ అయ్యాయి. ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళింది. వెంటనే అధికారులు పరుగున వెళ్లి పాపను ఆస్పత్రిలో చేర్పించారు. ఇక ఆ చిన్నారి సంరక్షణ ప్రభుత్వ బాధ్యత అని ప్రకటించారు. గుల్లు చౌదరి మంచి మనసుని గుర్తించి అతనికీ తగిన సాయం అందిస్తామన్నారు. ఇంకా చాలామంది పాపను పెంచుకోడానికి ముందుకు వస్తున్నారు.
… అలనాటి కుంతి నుంచి ఇప్పటివరకు చిన్నారులను గంగే తన అలల చేతుల్లో మోస్తూ ఒడ్డుకు చేరుస్తోంది. సకల పాపాలను కడిగే గంగ, ఈ పాపలను కూడా కడిగి పవిత్రీకరిస్తోందేమో! ఏమో!
-కె. శోభ
Must Read : కలి నుంచి కాపాడే దశ పాపహర దశమి