వైఎస్సార్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం వివాదం త్వరలోనే పరిష్కారం అవుతుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. కుటుంబ సభ్యులు మాట్లాడుకుని ఏకాభిప్రాయానికి రావాలని నిన్నటి సమావేశంలో ఇరు వర్గాలకూ చెప్పామని, వారు కొంత సమయం అడిగారని మంత్రి చెప్పారు. కుటుంబం మొత్తం కలిసి ఒకే పేరు సూచిస్తే ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని, కానీ వారు ఆ పని చేయలేకపోతే ప్రభుత్వం చట్ట ప్రకారం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.
పీఠాధిపతులు తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియజేయవచ్చని, అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున తాము ఏ పీఠాధిపతిని అక్కడికి పంపలేదని వెల్లంపల్లి తేల్చి చెప్పారు. కొంతమంది పీఠాధిపతులు అక్కడికి వెళ్లి ప్రశాంత వాతావరణం పాడు చేసేలా రాజకీయం చేశారు కానీ పరిష్కారం చూపలేదని మంత్రి అభిప్రాయపడ్డారు. అక్కడకు వెళ్లి ఒకరికి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటన చేయడం సమస్యను మరింత జటిలం చేసిందన్నారు. స్వామీజీలు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించడం తగదని మంత్రి హితవు పలికారు. ఇది సున్నితమైన విషయమని, సంప్రదాయాలు, మనోభావాలు గౌరవిస్తూ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.
పీఠాధిపతి అంశంపైనే ప్రస్తుతం దృష్టి సారించామని, ఈ అంశం కొలిక్కి వచ్చిన తరువాత అవినీతి ఆరోపణలపై తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. బ్రహ్మంగారి మఠంలో నిన్న పర్యటించిన వెల్లంపల్లి వెంకటేశ్వర స్వామి కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. మఠానికున్న పవిత్రత దృష్య్టా రెండువర్గాలూ ఏకాభిప్రాయానికి రావాలని సూచించారు.