Thursday, February 22, 2024
Homeజాతీయంకశ్మీర్లో ఎన్నికలకు త్వరలో ముహూర్తం?

కశ్మీర్లో ఎన్నికలకు త్వరలో ముహూర్తం?

జమ్మూ కశ్మీర్ లో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం సన్నద్ధం అవుతోందా ? రెండు రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు అందుకు బలం చేకూరుస్తున్నాయి. కశ్మీర్ విభజన తర్వాత ఫరూక్ అబ్దుల్లా, మహబూబా ముఫ్తీ పార్టీలు కొద్ది రోజులు ఆందోళనలు చేసినా ఆ తర్వాత ప్రశాంతత నెలకొంది. లోయలో పరిపాలనా యంత్రాంగం, రాజకీయ పరిస్థితులు పూర్తిగా కేంద్రం అధీనంలోకి వచ్చాయి.

అయితే దేశంలో కరోన విలయ తాండవానికి, కేంద్రం ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడమే కారణమని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. 45 ఏళ్ల లోపువారికి వ్యాక్సిన్ ఇచ్చే అంశంలో విధాన పరమైన నిర్ణయం తీసుకోవడంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం మీనమేషాలు లెక్కించటం విమర్శలకు తావిచ్చినట్టయింది. విపక్షాల విమర్శలతో పార్టీ, ప్రభుత్వ ప్రాబవం దెబ్బతినకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ – హోం మంత్రి అమిత్ షా ల ద్వయం నష్ట నివారణ మంత్రాంగంలో నిమగ్నం అయినట్టు కనిపిస్తోంది.

వచ్చే ఏడాది మార్చి నెలలో ఉత్తరప్రదేశ్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. యుపి ఎన్నికల్లో గెలుపు కమలనాథులకు ముఖ్యమైంది. ఆ రాష్ట్రం లో గెలిస్తే కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు అవకాశాలు మెండుగా ఉంటాయి. ఈ నేపథ్యంలో కశ్మీర్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే దేశ ప్రజల్లో పార్టీ పలుకుబడి పెరగటం, యుపి ఎన్నికల్లో కమల వికాసానికి తోడ్పడుతుందనే అంచనాల్లో బిజెపి నేతలు ఉన్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అంతా సజావుగా జరిగితే త్వరలోనే జమ్మూ కశ్మీర్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 370 ఆర్టికల్ రద్దు, కశ్మీర్ విభజన తర్వాత ఇతర ప్రాంతాల వారిని కూడా భూముల కొనుగోలుకు అనుమతించడంతో స్థానికంగా రియల్ బూమ్ పెరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి స్థిరపడ్డవారికి అర్హులైన శరణార్థులకు ఓటు హక్కు కల్పించటంతో లోయలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి.

ఈ తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జమ్మూ కశ్మీర్ రాజకీయ పార్టీలతో త్వరలోనే సమావేశం కానున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించి స్థానిక పరిస్థితులపై నేతలతో చర్చించనున్నారు. అఖిలపక్ష సమావేశానికి ప్రధాన రాజకీయ పార్టీలన్నింటిని ఆహ్వానిస్తున్నారు. వారం రోజుల్లో ఆల్ పార్టీ మీటింగ్ ఉంటుందని ప్రధానమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.

మరోవైపు కేంద్ర హోం శాఖమంత్రి అమిత్ షా తో శుక్రవారం జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సమావేశమై లోయలో అభివృద్ధి పనుల పురోగతిని వివరించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి వచ్చిన శరణార్థులకు భారత ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ కార్యక్రమాలు అందించి, వారికి అండగా ఉండాలని అమిత్ షా సిన్హాకు సూచించారు. వ్యవసాయ, పరిశ్రమల రంగాలతో పాటు పర్యాటక అభివృద్దిపై ప్రత్యేకంగా పథకాలు రూపొందించాలని సమావేశంలో నిర్ణయించారు.
గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ల సమావేశం రొటీన్ లో భాగమని హోం శాఖ వర్గాలు చెపుతున్నా అంతర్గత సంభాషణలు వేరే విధంగా ఉన్నాయి. అభివృద్ధి పనుల సమీక్ష కోసమైతే వ్యవసాయ, వాణిజ్య, పరిశ్రమల శాఖల అధికారులు రావాలి. ఢిల్లీ సమావేశం అందుకు భిన్నంగా జరిగింది. షా , సిన్హాల సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కేంద్ర హోం కార్యదర్శి అజయ్ భల్లా , ఇంటలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ అరవింద్ కుమార్, CRPF డైరెక్టర్ జనరల్, జమ్మూ కశ్మీర్ డిజిపి దిల్బాగ్ సింగ్ పాల్గొనటం ప్రాధాన్యం సంతరించుకుంది.

మనోజ్ సిన్హా, అమిత్ షా ల సమావేశం జరగటం ఆ మరుసటి రోజే ప్రధానమంత్రి కశ్మీర్ రాజకీయ పార్టీలతో సమావేశానికి సన్నాహాలు చేయటం ఆసక్తికరంగా మారింది. మాటల కన్నా చేతల్లోనే తమ  పనితనాన్ని చూపెట్టే నరేంద్ర మోడీ -అమిత్ షాల కదలికల్ని పట్టుకోవడం రాజకీయ విశ్లేషకులకు సాధ్యం కావటం లేదు. అయితే కశ్మీర్ లోయలో తొందరలోనే మార్పులు జరుగుతాయని జమ్మూ కశ్మీర్ తో పాటు ఢిల్లీ రాజకీయ వర్గాలు అంచనాతో ఉన్నాయి.

– దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్