Bheri : సిఎం జగన్ పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే డబ్బులు పంచుతున్నారని చంద్రబాబు విమర్శిస్తున్నారని, సంక్షేమం ఇష్టం లేకపోతే అదే విషయాన్ని బహిరంగంగా చెప్పాలని రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద రావు అన్నారు. తాము అధికారంలోకి వస్తే ఈ స్కీములు ఆపేస్తామని చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. సమాజంలో పేదలకు, బడుగు, బలహీనవర్గాలకు ఒక గౌరవం ఇవ్వాలని సిఎం జగన్ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. అనంతపురంలో జరిగిన సామాజిక న్యాయభేరీ బస్సు యాత్ర ముగింపు బహిరంగ సభలో అయన ప్రసంగించారు.
ఏ పథకం కోసం అయినా, ఎవరైనా, ఎవరి దగ్గరికైనా వెళ్లి అడుగుతున్నారా? అలాగే లంచం ఇవ్వాల్సి వస్తోందా?.. లేదు కదా. ప్రతి ఒక్క పథకం అర్హత ఉంటే, నేరుగా ఇంటి గడప వద్దకే వస్తోంది కదా? పేదల పథకాలను అపహాస్యం చేస్తే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ధర్మాన హెచ్చరించారు. “పథకం ఇవ్వడం మాత్రమే కాదు. అది గౌరవంగా ఇవ్వడం అనేది ముఖ్యం. అదే సీఎం శ్రీ వైయస్ జగన్‌గారు చేస్తున్నారు” అని వ్యాఖ్యానించారు.
ఈ ప్రభుత్వం మూడేళ్ల పాలన పూర్తి చేసుకుందని, గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం జగన్ పాలన కొనసాగిందని, గతంలో బడుగు, బలహీనవర్గాలవారు ఏనాడూ కేవలం పాలితులుగానే ఉన్నారు తప్ప, పాలకులుగా లేరని, కానీ ఈ ప్రభుత్వంలో నిజమైన సామాజిక న్యాయం జరిగింది. బడుగు, బలహీన వర్గాల వారికి కీలకమైన మంత్రి పదవులు ఇచ్చారని ధర్మాన ప్రశంసించారు. మంత్రివర్గంలో 70 శాతం పదువులు ఇవ్వడమే కాకుండా, కీలకమైన హోం వంటి శాఖలు వారికి ఇచ్చారని గుర్తు చేశారు. అలా ఇవ్వాలంటే ఎంతో ధైర్యం కావాలనిమ్, నిజం చెప్పాలంటే ఆ వర్గాల వారు సీఎంగా ఉన్నా, ఆ పని చేసే వారు కారని అభిప్రాయపడ్డారు.
ఇన్నాళ్లూ బీసీ, ఎస్సీ, ఎస్టీ. మైనారిటీలనూ సామాజికంగానూ, ఆర్థికంగానూ, విద్యాపరంగానూ అణగదొక్కారని, ఎవ్వరూ వారి గురించి ఆలోచించలేదని రాష్ట్ర ఉప ముఖ్యమంతి (ఎక్సైజ్ శాఖ) కె. నారాయణస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. కానీ తొలిసారిగా సీఎం వైఎస్ జగన్ ఆ వర్గాలకు మంత్రి పదవులు మొదలు, అన్ని రాజకీయ పదవులు, నామినేటెడ్ పదవుల్లో అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారని అయన కొనియాడారు.
చివరకు విజయవాడ మేయర్ జనరల్‌కు కేటాయించినా, బీసీ అభ్యర్ధికి ఆ పదవి ఇచ్చారని, ఆయా వర్గాల పట్ల తన చిత్తశుద్ధి చాటుకున్నారని నారాయణస్వామి గుర్తుచేశారు. అందుకే మనమంతా ఆయనకు రుణపడి ఉండాలని ఆయనకు అండగా నిలవాలని, తప్పనిసరిగా మళ్లీ గెలిపించుకోవాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు, బీసీ ప్రజా ప్రతినిధులు, వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.