Saturday, November 23, 2024
HomeTrending Newsఎస్సీ గురుకులాలకు అదనపు హంగులు

ఎస్సీ గురుకులాలకు అదనపు హంగులు

Gurukulam: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సాంఘిక సంక్షేమ గురుకులాలలో అన్ని సమస్యలు పరిష్కరిస్తామని, మరిన్ని హంగులను సమకూర్చడానికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. ఎస్సీ గురుకులానికి చెందిన బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ (బీవోజీ) 70 వ సమావేశం మంగళవారం తాడేపల్లిలోని గురుకులం ప్రధాన కార్యాలయంలో మంత్రి మేరుగు నాగార్జున అధ్యక్షతన జరిగింది. గురుకులాల్లో నాణ్యమైన విద్యను అందించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు.

సమీక్ష సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎస్సీ విద్యార్థులకు వృత్తి విద్యలలో కూడా శిక్షణలు ఇవ్వాలని నిర్ణయించామని, శ్రీకాకుళం, విజయవాడ, తిరుపతి, అనంతపురంలో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఏఎన్ఎం కోర్సులలో శిక్షణలు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు.

క్రీడల్లో కూడా విద్యార్థులను నిష్ణాతులుగా తీర్చిదిద్దడానికి ఏలూరు జిల్లాకు చెందిన కొలసానిపల్లి, పెదవేగి లలో స్పోర్ట్స్ అకాడమీలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న మూడు ఐఐటీ, నీట్ శిక్షణా కేంద్రాలకు అదనంగా ఉమ్మడి జిల్లాలో జిల్లాకు ఒకటి చొప్పున 11 శిక్షణా కేంద్రాలను కొత్తగా ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించామన్నారు ఖాళీగా ఉన్న 90 స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేయడానికి, అవసరమైన చోట కొత్తగా నర్సింగ్ పోస్టులను మంజూరు చేయడానికి కూడా చర్యలు తీసుకోనున్నామని తెలిపారు. తుప్పు పట్టిన ఐరన్ పైపుల స్థానంలో పీవీసీ పైపులను ఏర్పాటు చేసి విద్యార్థులకు రక్షిత మంచినీటిని అందించాలని, తాగునీటి కొరత ఉన్న గురుకులాల్లో సమస్య తీర్చడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు. 179 ఎస్సీ గురుకులాల్లో ఈ ఏడాది సీబీఎస్ఇ విద్యావిధానాన్ని అమలు చేస్తున్నామని, దీనిలో భాగంగానే గురుకులాలకు చెందిన టీజీటీ టీచర్లకు సీబీఎస్ఇ కి చెందిన ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ లలో శిక్షణ ఇప్పుస్తున్నామని పేర్కొన్నారు.

ఎస్సీ గురుకులాలలో విద్యుత్ పొదుపును ప్రోత్సహించడానికి వినూత్నంగా రూ.65.06 కోట్ల వ్యయంతో సోలార్ ప్యానెళ్లను… రూ.7 కోట్లతో సీసీ కెమెరాలను ఐటీ విభాగం ద్వారా ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు.

ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శి ఎం.ఎం. నాయక్, డైరెక్టర్ కే.హర్షవర్ధన్, గురుకులం కార్యదర్శి పావనమూర్తితో పాటు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Also Read : గురుకులాల్లో పూర్తిస్థాయి డిజిటల్ లెర్నింగ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్