Kcr : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా జరిగాయి. వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించి, జెండా వందనం చేశారు. అనంతరం రాష్ట్ర ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కరెంటు కష్టాలకు చెరమగీతం పాడిన రాష్ట్రం తెలంగాణ నిలిచింది. ఈనాడు రాష్ట్రంలో అన్నిరంగాలకు నిరంతరాయంగా, రైతులకు ఉచితంగా 24 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న దేశంలోని ఏకైక రాష్ట్రం మన తెలంగాణ అని చెప్పేందుకు నేను గర్విస్తున్నాను.. సంతోషిస్తున్నాను.
రాష్ట్రం ఏర్పడిన విద్యుత్ కోతలతో, పవర్ హాలీడేలతో మనం ఉక్కిరిబిక్కిరి అయిన విషయం తెలుసు. రాష్ట్రం ఏర్పడే నాటికి స్థాపిత విద్యుత్ సామర్థ్యం కేవలం 7,778 మెగావాట్లు మాత్రమే. ప్రభుత్వం చేసిన కృషి ఫలితంగా నేడు మన రాష్ట్రం కలిగిన స్థాపిన విద్యుత్ సామర్థ్యం 17,305 మెగావాట్లు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్రం గత ఎనిమిదేళ్లలో 74 మెగావాట్ల నుంచి 4,478 మెగావాట్ల రికార్డు స్థాయి పెరుగుదల సాధించింది. తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ ప్రథమస్థానంలో నిలిచింది. 2014లో తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం 1,110 యూనిట్లు కాగా.. ఇప్పుడది 2012 యూనిట్లకు పెరిగింది. ఇది జాతీయ తలసరి వినియోగంతో పోలిస్తే మన రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 73శాతం అధికంగా ఉన్నది.
వందశాతం ఆవాసాల్లో ఇంటింటికీ స్వచ్ఛమైన మంచినీరు
తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ఉన్నప్పుడు పల్లెలు సాగునీటి కోసమే కాదు.. తాగునీటికి తల్లడిల్లాయి. నల్లగొండ జిల్లాను ఫ్లోరైడ్ భూతం పట్టిపీడించేది. చిన్నవయసులోనే నడుము వంకరపోవడం, బొక్కలు విరగడం, కాళ్లు వంకర తిరగడం వంటి సమస్యలతో నల్లగొండ బిడ్డలు సతమతమయ్యారు. తెలంగాణ ఏర్పడిన వెనువెంటనే తాగునీటి సమస్య పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికపై మిషన్ భగీరథ పథకాన్ని సాధించింది. నేడు రాష్ట్రంలోని వందశాతం ఆవాసాల్లో ఇంటింటికీ స్వచ్ఛమైన, సురక్షిత మంచినీరు సరఫరా కావడం నాకు సంతోషంగా ఉన్నది. అతితక్కువ బృహత్తరమైన పథకాన్ని పూర్తి చేసిన ఘనత మన ప్రభుత్వానికే దక్కుతుంది.
ఈ పథకాన్ని ఎందరో ప్రశంసించారు. నేషనల్ వాటర్ మిషన్ అవార్డు కూడా లభించింది. తెలంగాణ అమలు పరిచిన మిషన్ భగీరథ పథకాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిందిగా అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. అనేక రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, అధికారులు మన రాష్ట్రానికి వచ్చి ఈ పథకం తీరుతెన్నులను పరిశీలించి వెళ్లడం మనందరికీ గర్వకారణం. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడా మంచినీరు దొరకని ప్రాంతం లేదు. నీటి కోసం మహిళలు బారులు తీరిన దృశ్యాలు, మంచినీటి యుద్ధాలు లేవు. ప్రజల దాహార్తిని తీర్చాలన్న ప్రభుత్వ అంకిత భావానికి ఇది ప్రబల నిదర్శనం’ అన్నారు.
ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ‘‘బలమైన కేంద్రం – బలహీనమైన రాష్ట్రాలు’’ అనే కుట్రపూరితమైన, పనికిమాలిన సిద్ధాంతాన్ని ప్రాతిపదికగా చేసుకొన్నది. అందుకే ఈ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాల హక్కుల హననం పరాకాష్టకు చేరుకున్నది. కూచున్న కొమ్మను నరుక్కున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆర్ధికంగా బలహీనపరిచే కుతంత్రాలకు పాల్పడుతున్నది. కేంద్రం విధించే పన్నుల నుంచి రాజ్యాంగ విహితంగా రాష్ట్రాలకు రావల్సిన వాటాను ఎగ్గొట్టేందుకు ప్రస్తుత కేంద్రప్రభుత్వం పన్నులను సెస్సుల రూపంలోకి మార్చి వసూలు చేస్తున్నది. రాష్ట్రాల వాటాగా రావాల్సిన లక్షలాది కోట్ల రూపాయలను కేంద్రం నిస్సిగ్గుగా హరిస్తున్న విషయం జగద్విదితం. ఇది చాలదన్నట్టు రాష్ట్రాల ఆర్ధిక స్వేచ్ఛను దెబ్బతీస్తూ నిరంకుశంగా రకరకాల ఆంక్షలు విధిస్తున్నది. ఎఫ్.ఆర్.బి.ఎం. చట్టం నిబంధనలను రాష్ట్రాలు విధిగా పాటించాలని శాసిస్తున్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం, తను మాత్రం ఏ నియమాలకూ కట్టుబడకుండా విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నది.
రుణాలు, పెట్టుబడి వ్యయాలు ఎఫ్.ఆర్.బి.ఎం పరిమితులకు లోబడే నిర్వహిస్తూ, ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తున్న తెలంగాణ వంటి రాష్ట్రాలకు కేంద్రం వైఖరి గుదిబండలా తయారయింది. కేంద్రం వెంటనే పునరాలోచించాలని రాష్ట్రాలపై విధిస్తున్న ఆర్థిక ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని, రాష్ట్రాల హక్కుల హననాన్ని ఇకనుంచైనా మానుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. కేంద్రానికి తలవొగ్గి రైతు వ్యతిరేక విద్యుత్ సంస్కరణలు అమలుచేయక పోవడం వల్ల తెలంగాణ ఏటా ఐదు వేల కోట్ల రూపాయలు సమకూర్చుకొనే అవకాశం కోల్పోయింది. మొత్తం ఐదేళ్లలో 25 వేల కోట్ల రూపాయలు నష్టపోవలసి వస్తోంది. ఈ 25 వేల కోట్ల రూపాయల కోసం చూస్తే రైతుల బాయిలకాడ మీటర్లు పెట్టాలి. రైతుల నుంచి విద్యుత్ చార్జీలు వసూలు చేయాలి. అది మన విధానం కాదు. రైతులమీద భారం వేసే చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. కంఠంలో ప్రాణమున్నంతకాలం రైతాంగానికి నష్టంచేసే విద్యుత్ సంస్కరణలను అంగీకరించేది లేదు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సే నాకు ముఖ్యం.
75 ఏండ్ల స్వతంత్రం తర్వాత ఇంకా మన దేశాన్ని దారిద్ర్యబాధ ఎందుకు పీడిస్తున్నది? సుసంపన్నమైన వనరులు ఉండి, కష్టంచేసే ప్రజలుండీ వినియోగించుకోలేని అసమర్థతకు బాధ్యులు ఎవరు? దేశాన్ని నడిపించటంలో వైఫల్యం ఎవరిది ? విజ్ఞులైన దేశ పౌరులు ఈ విషయాలపైన గంభీరంగా ఆలోచించవలసిన అవసరం ఉంది. ప్రతి ఐదేళ్లకోసారి జరిగే అధికార మార్పిడి కాదు ముఖ్యం. అధికార పీఠం మీదికి ఒక కూటమి బదులు మరో కూటమి ఎక్కడం కాదు కావాల్సింది. దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపే ప్రగతిశీల ఎజెండా కావాలి. దేశానికి నూతన గమ్యాన్ని నిర్వచించాలి. ప్రజల జీవితాల్లో మౌలికమైన పరివర్తన తేవాలి. దేశంలో గుణాత్మక మార్పు రావాలి.
75 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం తర్వాత దేశంలో ప్రజాస్వామ్యం పరిణతిని పొంది అధికారాల వికేంద్రీకరణ జరగకపోగా, నిరంకుశ పోకడలు పెరిగి అధికారాలు మరింత కేంద్రీకృతమవుతున్నాయి. విశాలతరం కావల్సిన సమాఖ్య స్ఫూర్తి కుంచించుకు పోతున్నది. భారత రాజ్యాంగం రాష్ట్రాలకు గణనీయమైన రాజకీయ, శాసనాధికారాలను, పాలనాధికారాలను, స్వయంప్రతిపత్తిని కల్పించింది. ఇప్పటివరకూ కేంద్రంలో గద్దెనెక్కిన ప్రభుత్వాలన్నీ, రాజ్యాంగ స్ఫూర్తిని మంటగలుపుతూ రాష్ట్రాల స్వయంప్రతిపత్తిని కాలరాశాయి. అధికారాలను నిస్సిగ్గుగా హరించాయి.
భారత రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్ కేంద్రం పరిధిలోని అధికారాలనూ, రాష్ట్రాల పరిధిలోని అధికారాలనూ స్పష్టంగా నిర్వచించింది. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అనే మూడు జాబితాలను నిర్దేశించింది. దేశాన్ని పాలించిన అన్ని ప్రభుత్వాలూ రాష్ట్ర జాబితాలోని వివిధ అంశాలను క్రమంగా ఉమ్మడి జాబితాలోకి లాగేసుకున్నాయి. కాలం గడుస్తున్నకొద్దీ ఉమ్మడి జాబితా పెరుగుతున్నది. రాష్ట్ర జాబితా తరుగుతున్నది. రాజ్యాంగం పేర్కొన్న రాష్ట్రాల స్వయంప్రతిపత్తి నామావశిష్టమైపోతున్నది. గతంలో కేంద్ర ప్రభుత్వాలే ఏర్పాటు చేసిన సర్కారియా మరియు పూంఛ్ కమిషన్లు రాష్ట్రాల హక్కులను పరిరక్షించేందుకు పలు సూచనలు చేశాయి. కానీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన అన్ని ప్రభుత్వాలూ ఈ కమిషన్ల నివేదికలను బుట్ట దాఖలు చేశాయి. ఇప్పటివరకూ దేశాన్ని ఏలిన ఈ ప్రభుత్వాలు అనుసరించిన ధోరణులు ప్రజాస్వామ్య వ్యవస్థకు ఏరకంగానూ మంచి చేయజాలకపోగా, దేశ ప్రజలు ఆశిస్తున్న అభివృద్ధికి, వికాసానికి తీవ్ర అవరోధాలుగా మారాయి.
Also Read : తెలంగాణ ఏర్పడిన వేళ…