Saturday, November 23, 2024
HomeTrending Newsయుపి ప్రభుత్వం కీలక నిర్ణయం

యుపి ప్రభుత్వం కీలక నిర్ణయం

గతంలోలా ఈ రోజుల్లో అమ్మాయిలకు సామాజిక పరమైన కట్టుబాట్లు లేవు. ఎటువంటి వృత్తి ఉద్యోగాలైనా ఎంచుకోవచ్చు. అందుకే కాల్ సెంటర్స్, షిఫ్టుల్లో పనిచేసే మహిళల సంఖ్య పెరిగింది. అయితే ఎవరూ హామీ ఇవ్వలేనిది మహిళల భద్రత. అందుకే మహిళలపై జరిగే నేరాలు తగ్గడం లేదు. ఇటీవల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మహిళా కార్మికులకు నైట్ షిఫ్టులు వేయకూడదని, తప్పనిసరి అయితే వారి అనుమతి ఉండాలని ఉత్తర్వులు జారీ చేసింది. అంతే కాదు రాత్రి పూట పనిచేసే వారికి భోజనం, రవాణా సదుపాయాలు, భద్రత యాజమాన్యాల బాధ్యతని స్పష్టంగా చెప్పింది. ఈ సందర్భంగా ఒక మహిళా జర్నలిస్టుగా నేను ఎదుర్కొన్న అనుభవాలు గుర్తొచ్చాయి.
వెళ్లాల్సిందే!
ప్రముఖ దినపత్రికలో మహిళా పేజీ సబ్ ఎడిటర్, రిపోర్టర్ గా సుమారు పదేళ్లకు పైగా పనిచేసాను. మొదటి ఐదేళ్లు ఆడుతూ పాడుతూ పనిచేశా. తర్వాత మొదటిసారిగా షిఫ్ట్ సిస్టమ్ పెట్టారు. అంతవరకూ మహిళా పేజీలో ఉదయం పదింటి నుంచి సాయంత్రం అయిదు గంటల వరకు పనివేళలు. ఎవరేమన్నారో గానీ మధ్యాహ్నం షిఫ్ట్ కూడా చెయ్యాలన్నారు. అది రెండు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఉండేది. త్వరలోనే దీనికీ అలవాటు పడ్డాం. ఇవి కాక మధ్యలో రిపోర్టింగ్ చేయాల్సి వచ్చేది. ఆఫీసు దగ్గరే ఇల్లు కావడం వల్ల ఒక్కోసారి ఫోన్ చేస్తే అర్థరాత్రి అయినా వెళ్లి పేజీ సరి చేయాల్సి వచ్చేది. ఒకసారి మా బాబు రెండేళ్ల వయసులోఉండగా నన్ను ఆఫీస్ అయిపోయాక రాత్రి ఒక ఫ్యాషన్ షో కవర్ చెయ్యమన్నారు. అప్పుడు నా భర్త ఊళ్ళో లేరు. ఊరినుంచి తోడుగా వచ్చిన అత్తగారు ఉన్నారు. సాయంత్రం వరకే కదా అనుకుంటే ఈ పని పడింది. మా ఇంఛార్జిని కలిసి పరిస్థితి వివరించే ప్రయత్నం చేశా. ఆయన చాలా కోపంగా వెళ్లాల్సిందే అన్నారు. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. డెస్క్ లో అబ్బాయిలు ఉన్నారు. అయినాసరే పంతంగా నన్నే వెళ్లమన్నారు. సరే, ఇంటికొచ్చి అత్తగారికి వివరంగా చెప్పి వెళ్లి ఆ ఈవెంట్ కవర్ చేసి ఇంటికొచ్చేసరికి రాత్రి పన్నెండు అయింది. వెళ్లడం, రావడం మనదే రిస్క్ . ఆటోలో వెళ్ళాలి. వచ్చేసరికి పిల్లవాడికి జ్వరం. జర్నలిస్టుగా వేళాపాళా ఉండదని తెలిసి ఎంచుకున్నా సరే, ఎందుకొచ్చిన ఉద్యోగం అనిపించిన క్షణమది.
మరోసారి..
కొన్నాళ్ళకు ఒక కొత్త ఇంఛార్జి వచ్చాడు. ఆయన ఇంటికెప్పుడు వెళ్తాడో ఎవరికీ తెలియదు. మనం పని ముగించుకుని టైం కి వెళ్ళిపోతే అస్సలు నచ్చదు. దాంతో ఆర్టికల్స్ రాయడం పైన, శీర్షికలపైన లెక్చర్స్ ఇచ్చేవాడు. ఒక హెడ్డింగ్ కోసం అయిదారు గంటలు కూర్చోపెట్టిన ఘనత ఆయనది. ఎంత పని ఇచ్చినా చక చకా చేసి వెళ్లిపోవడం అలవాటు కావడం వల్ల ఈయన దగ్గర పని అస్సలు నచ్చేది కాదు. ఒకటి రెండు సార్లు తెల్లారుజాము మూడింటివరకు సాగదీసేవాడు. అప్పుడు ఇంటికి ఎలా వెళ్తారనిగానీ, ఫుడ్ ఎలాగని కానీ మాట్లాడేవాడు కాదు. ఇలాంటివాళ్ళు ఒకళ్ళుంటే చాలు ఉద్యోగం మీద విరక్తి కలగడానికి. ఆయనకీ నా అసహనం తెలిసిందేమో, అక్కడినుంచి పంపించేశాడు. తర్వాతది మరో కథ. దాదాపు అన్ని పత్రికల్లో మహిళలది ఇదే వ్యథ.
ఏదేమైనా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మహిళా కార్మికులకు నైట్ డ్యూటీలు వేయకూడదని ఫ్యాక్టరీలకు ఉత్తర్వులు జారీ చెయ్యడం అభినందనీయం. అన్ని రాష్ట్రాలూ ఇటువంటి చర్యలు చేపడితే మహిళలు ధైర్యంగా పనిచేయగలుగుతారు.

-కె. శోభ

Also Read : అమెరికా గన్ కల్చర్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్