No compromise: జనసేన-బిజెపి బంధం బలంగా ఉందని, కొద్ది కాలం క్రితం కొంత సోషల్ డిస్టెన్స్ వచ్చినా ఇప్పుడది పోయిందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇటీవల బిజెపి జాతీయ నేతలతో కూడా చర్చలు జరిపామని, తనను సిఎం అభ్యర్దినని వారు చెప్పలేదని స్పష్టం చేశారు. పొత్తులపై అందరూ తనను అడుగుతున్నారని కానీ. కొద్ది కాలం క్రితం ‘వన్ సైడ్ లవ్’ అంటూ వ్యాఖ్యలు చేసిన టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు ఇప్పుడు వార్ వన్ సైడ్ అంటున్నారని, ఈ విషయంలో చంద్రబాబుకు స్పష్టత వచ్చిన తరువాత మాట్లాడతానన్నారు.
రాష్ట్రం కోసం తాను చాలాసార్లు తగ్గానని ఈసారి మిగతావాళ్ళు తగ్గిదే బాగుంటుందని సూచించారు. 2014, 2019 లో తగ్గామని, 2024 తగ్గేదే లేదు అంటూ తేల్చి చెప్పారు. బైబిల్ లో చెప్పినట్లుగా ‘తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు’ అనే సూత్రం టిడిపికి కూడా వర్తిస్తుందని చురకలంటించారు. జనసేన ముందు మూడు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని, జనసేన-బిజెపి ప్రభుత్వం స్థాపించడం, జనసేన-బిజెపి-టిడిపి కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం, జనసేన సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం అని వెల్లడించారు. ఒంటరిగా పోటీ చేసేందుకైనా సిద్ధంగా ఉన్నామని, పోరాడితే పోయేదేమీ లేదంటూ తన అభిప్రాయం చెప్పారు పవన్.