Misguided: చంద్రబాబు బినామీ పోరాటానికి ప్రొఫెసర్లు హరగోపాల్, కోదండరాంలు మద్దతు తెలపడం దురదృష్టకరమని వైఎస్సార్ సీపీ నేత, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ వ్యాఖ్యానించారు. భూస్వామ్య వర్గాలకు మద్దతు ఇవ్వడం కోసమే వారిద్దరూ అమరావతి వచ్చారా అని ప్రశ్నించారు. భూములు కోసం రాజధానా? రాజధాని కోసం భూములా? అన్నది వారు పరిశీలించాలని సూచించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో డొక్కా మీడియాతో మాట్లాడారు.
ఒకప్పుడు చంద్రబాబును ‘ప్రపంచబ్యాంక్ జీతగాడు బాబు’ అన్న వీరే ఇప్పుడు అయన విధానాలకు మద్దతు పలకడం శోచనీయమన్నారు మాణిక్య వరప్రసాద్. కోనసీమకు అంబేడ్కర్ పేరు పెట్టాలని చెప్పని వారితో ఎలా జత కడతారని నిలదీశారు. అమరావతి దళిత రాజధాని అని ఎవరో చెబితే నమ్మడం ఎంతవరకూ ధర్మమో ఆ కార్యక్రమానికి వ్చచిన పెద్దలు ఆలోచించాలన్నారు. ఇక్కడ పేదలకు నివాస స్థలాలు ఇస్తుంటే అడ్డుకున్నారని అలాంటప్పుడు ఇది అందరి రాజధాని ఎలా అవుతుందన్నారు.
టీడీపీ హయాంలో రాజధాని కోసం భూ సమీకరణ జరిగేటప్పుడు దళిత రైతుల భూముల విషయంలో…ప్యాకేజీ రాదని, ప్రభుత్వం ఉన్నపళంగా రైతుల భూములు లాగేసుకుంటుందని భయపెట్టారని వరప్రసాద్ గుర్తు చేశారు. రాజధాని రైతుల భూములను అభివృద్ధి కోసం సింగపూర్ కంపెనీకి ఇవ్వడాన్ని కోదండరామ్, హరగోపాల్ సమర్ధిస్తుంటే ఆ విషయాని స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు ట్రాప్‌లో వీరిద్దరూ పడ్డట్లు అనిపిస్తోందన్నారు.
అమరావతి పేరుతో జరుగుతున్న ఉద్యమం అంతా ఒక పెద్ద ప్రహసనం అని, దాన్ని గొప్పగా చూపించుకోవడానికే అమరావతికి కొంతమంది పెద్దలను తీసుకువచ్చారని మాణిక్య వరప్రసాద్ అన్నారు. సామాజిక న్యాయ వ్యతిరేక శక్తులతో వారు కూర్చోవడం భావ‍్యం కాదని, అమరావతి రాజధానిపై హైకోర్టు జడ్జిమెంట్‌ను ఇంప్లిమెంట్ చేయడం, చదవడం సాధ్యం కాదని, ఆ విషయం రిటైర్డ్ జడ్జి గోపాల్ గౌడ్ కి తెలియదా అని ప్రశ్నించారు.