దేశంలో వ్యవసాయ స్వరూపం మారాలని, యాంత్రీకరణ, సాంకేతికత సంపూర్ణంగా అమలు చెయ్యాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వ్యవసాయ, ఉద్యాన రంగాలలో నూతన ఆవిష్కరణలు మరియు సాంకేతికతతో యువతకు ఉపాధి లభించాలన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ లోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో నిర్వహించిన “అధిక సాంద్రతతో పత్తి సాగుపై క్షేత్రస్థాయి అధికారులకు అవగాహన సదస్సు”లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు. సాగులో నూతన శకానికి నాంది పలికాం .. సాంప్రదాయ సాగునుండి ప్రపంచ సాంకేతికతను తెలంగాణ వ్యవసాయానికి అన్వయించుకోవాలన్నది ప్రభుత్వ సంకల్పమన్నారు. కేవలం అధిక మోతాదులో పంటలు పండించడమే కాదు. అవసరమైన పంటలు, మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలు, రైతుకు రాబడినిచ్చే పంటలు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని అధిక దిగుబడులు సాధించి రాష్ట్ర ఆదాయం, దేశ ఆదాయం పెంచేలా తెలంగాణ వ్యవసాయం ముందుకుసాగాలన్నారు.
మూడేళ్లుగా రైతులను అప్రమత్తం చేస్తున్నాం. జిల్లాల వారీగా సదస్సులతో ఏ పంటలు వేయాలి అన్న విషయాన్ని రైతులకు వివరించాం. రైతులు కూడా పంటల వైవిద్యీకరణకు సానుకూలంగా ఉన్నారని మంత్రి తెలిపారు. ప్రపంచ అవసరాలకు సరిపడా పత్తి ఉత్పత్తి కావడం లేదు. ప్రపంచంలో పత్తి అత్యధికంగా సాగయ్యేది భారతదేశంలోనే అన్నారు. 3.20 కోట్ల ఎకరాలలో దేశంలో పత్తి సాగు అవుతున్నది. మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా తర్వాతి స్థానాలలో తెలంగాణ, గుజరాత్ లు ఉన్నయన్నారు.
చైనాలో 80 లక్షల ఎకరాలలో, అమెరికాలో 75 నుండి 80 లక్షల ఎకరాలలో పత్తి సాగవుతున్నది. బ్రెజిల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలో 18 నుండి 50 లక్షల ఎకరాలలో పత్తి సాగవుతున్నది. అయితే చైనాలో 80 లక్షల ఎకరాలలోనే మనకన్నా మూడింతల ఎక్కువ దిగుబడిని సాధిస్తున్నారని మంత్రి వెల్లడించారు. ఉత్పాదకతలో మన దేశం వెనకబడి ఉంది. ప్రపంచ సాంకేతికత అందిపుచ్చుకుని ఉంటే 3.20 కోట్ల ఎకరాలలో పత్తి సాగుతో ప్రపంచ అవసరాలను పూర్తిగా మనమే తీర్చే అవకాశం ఉన్నదన్నారు. బయటి దేశాలలో పెద్ద, పెద్ద భూ కమతాలు ఉండడం మూలంగా వారు వ్యవసాయ యాంత్రీకరణను సులువుగా అమలు చేసుకోగలుగుతున్నారు. మన దేశంలో చిన్న, చిన్న భూకమతాలు యాంత్రీకరణకు ఖర్చుతో కూడినవిగా వుంటున్నవని చెప్పారు. సింగిల్ పిక్ పత్తి సాగు వైపు రైతులను ప్రోత్సహించాలి. అదే సమయంలో రైతుల భూములు అధిక సాంధ్రత పత్తి సాగుకు అనుకూలమా ? లేదా ? అన్నది నిర్ణయించుకోవాలన్నారు.
జులై 15 వరకు పత్తి సాగుకు అవకాశం ఉందని, భూమి చల్లబడక ముందే విత్తనాలను నాటడం మూలంగా విత్తనం ఉడికి ఇబ్బందులు వస్తాయని సూచించారు. మొదటి వానకు కాకుండా రెండో వాన తర్వాతనే పత్తి సాగుకు సిద్దం కావాలన్నారు. అధికసాంద్రత పత్తి సాగులో తెలంగాణ దేశానికి తలమానికం కావాలి. భవిష్యత్ లో రాష్ట్రంలో ప్రతి పంట సాగు వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సూచనల ప్రకారం జరగాలని మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు.
Also Read : టార్గెట్ ఇరవై లక్షల ఎకరాలు : మంత్రి నిరంజన్‌రెడ్డి