Babu on Botsa: జగన్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై ప్రజలు తిరగబడాల్సిన సమయం ఆసన్నమైందని, గడప గడపకు అంటూ వస్తున్న నేతలను నిలదీయాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చారు. ఎన్టీఆర్ సినిమా బొబ్బిలి పులి స్పూర్తితోముందుకు సాగాలని, కార్యకర్తలకు అండగా ఉంటానని బాబు భరోసా ఇచ్చారు. తమ కార్యకర్తల జోలికి వస్తే వారికి అండగా ఉండి రక్షించుకునే సామర్ధ్యం తెలుగుదేశం పార్టీకి ఉందని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత అన్నిటిపై పన్నులు పెంచి సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని, అందుకే బాదుడే బాదుడు కార్యక్రమం చేపట్టామన్నారు. రేపో మాపో మళ్ళీ ఆర్టీసీ ఛార్జీలు పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని బాబు వెల్లడించారు.
జిల్లాల పర్యటనలో భాగంగా విజయనగరంలో పర్యటించిన చంద్రబాబు నగరంలో జరిగిన రోడ్ షో లో పాల్గొని ప్రసగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయని, ఇంటికో ఉద్యోగం వస్తుందని, తమని గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి హోదా సాధిస్తామని నాడు జగన్ చెప్పాడని, ఇప్పుడు ఎందుకు హోదాపై మాట్లాడడం లేదని బాబు ప్రశ్నించారు. ఢిల్లీ దగ్గర మెడలు వంచుతున్నారని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్రపై విజయసాయి, సుబ్బారెడ్డి పెత్తనం ఏమిటని నిలదీశారు. బొత్స కు సారా వ్యాపారం తప్ప ఏమీ తెలియదని అలాంటి వారు విద్యామంత్రిగా ఉన్నారని, తల్లిదండ్రులు సరైన శ్రద్ధ పెట్టకపోవడం వల్లే విద్యార్ధులు పదో తరగతి ఫెయిల్ అయ్యారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలకు గాను పద్మశ్రీ ఇవ్వాలని వ్యంగ్యంగా అన్నారు.
అశోక్ గజపతి రాజు పైనే కేసులు పెట్టిన దిక్కుమాలిన ప్రభుత్వమని విమర్శించారు. విజయనగరం రాజుల వంశంగా… ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన ఆ కుటుంబంపై కేసులు పెట్టడం దుర్మార్గమని విమర్శించారు. తాను రామతీర్థం పర్యటనకు వస్తే తనపైనే కేసులు పెట్టారని గుర్తు చేస్తూ, మంచిగా చెబితే ఈ ప్రభుత్వానికి అర్ధం కావడం లేదని అందుకే ఏం పీక్కుంటారో పీక్కోవాలని సవాల్ చేశానని వ్యాఖ్యానించారు.
Also Read : పెట్రో పన్నులు తగ్గించాలి – చంద్రబాబు