Saturday, November 23, 2024
HomeTrending NewsDraupadi Murmu : 25న ద్రౌపది ముర్ము నామినేషన్

Draupadi Murmu : 25న ద్రౌపది ముర్ము నామినేషన్

ద్రౌపది ముర్ము.. కొద్ది గంటలుగా ఈ పేరు ట్రాప్ ట్రెండింగ్ లో నిలిచింది. ఎన్డీఏ కూటమి అత్యంత వ్యూహాత్మకంగా గిరిజన మహిళ అయిన ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా  ప్రకటించింది. అర డజనుకుపైగా రాష్ట్రాల్లో గిరిజన ఓటర్లు నిర్ణయాత్మక శక్తిగా ఉండటం, మహిళా సెంటిమెంట్ కూడా 2024 ఎన్నికల్లో కలిసొస్తుందనే బీజేపీ ఆమెను ఎంచుకుందనే రాజకీయ వాదనలు పక్కనపెడితే, నిజంగానే ద్రౌపది ముర్ము ఎదుగుదల భారత ప్రజాస్వామ్యంలో ఒక గొప్ప పాఠానికి తక్కువేమీ కాదు. రాజకీయంగా ఉజ్వల జ్యోతిలా వెలుగుతున్నప్పటికీ.. ద్రౌపది ముర్ము వ్యక్తిగత జీవితం అత్యంత విషాదభరితం. అన్నీ తట్టుకొని నిలిచిన ఆమె ఎందరికో స్ఫూర్తిగా ఉన్నారు. ద్రౌపది ముర్ము ఈ నెల 25వ తేదిన రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేసే అవకాశం ఉంది. రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించగానే ముర్ముకు అభినందనలు వెళ్ళువెత్తాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆమెకు జడ్ ప్లస్ భద్రత ఏర్పాటు చేసింది. రాష్ట్రపతి అభ్యర్థిగా తన పేరు ప్రకటించాక తాను చిన్నప్పటి నుండీ వెళుతున్న శివాలయానికి వెళ్లి గుడి అంతా చీపురుతో శుభ్రం చేసి శివయ్యను దర్శించుకున్న కాబోయే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.

అధికార ఎన్డీఏ కూటమి తమ రాష్ట్రపతి అభ్యర్థిగా 64 ఏళ్ల ద్రౌపది ముర్ము పేరును ప్రకటించినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఆమె గురించి ఇంటర్నెట్ లో సెర్చింగ్ జరుగుతోంది. అన్నీ అనుకూలిస్తే భారతదేశానికి రాష్ట్రపతి అయ్యే తొలి గిరిజన మహిళగా ద్రౌపది చరిత్ర సృష్టిస్తారు. అత్యంత పేద కుటుంబంలో పుట్టిన ఆమె 25 ఏళ్ల  వృత్తి జీవితంలో.. రాజకీయాల్లో కిందిస్థాయి పదవి అయిన కౌన్సిలర్‌ నుంచి అత్యున్నతమైన రాష్ట్రపతి పదవికి పోటీ పడే స్థాయికి ఎదిగారు. 1958, జూన్ 20న ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లా బైడపోసిలో ద్రౌపది ముర్ము జన్మించారు. ఆమెకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. రాజకీయాల్లోకి రాకముందు టీచర్ గా పనిచేశారు. 2000-2004 వరకు ఒడిశా అసెంబ్లీలో ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత గవర్నర్‌గా పనిచేశారు.

ఒడిశాలోని భారతీయ జనతా పార్టీ, బిజూ జనతాదళ్ సంకీర్ణ ప్రభుత్వంలో మార్చి 6, 2000 నుంచి ఆగస్టు 6, 2002 వరకు వాణిజ్యం, రవాణ శాఖకు స్వతంత్ర రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఆగస్టు 6, 2002 నుంచి 2004 మే వరకు మత్స్య, జంతు వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశారు. ఆమె తన రాజకీయ జీవితాన్ని కౌన్సిలర్‌గా ప్రారంభించి, తరువాత రాయంగ్‌పూర్ నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ లేదా NAC వైస్-ఛైర్‌పర్సన్‌ అయ్యారు. 2013లో ఆమె పార్టీ ఎస్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలి స్థాయికి ఎదిగారు. కాగా, రాష్ట్రపతిగా అభ్యర్థిగా ముర్మునే తొలి ఆదివాసీ మహిళ కావడం గమనార్హం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్