రాజ్యసభ సభ్యులుగా దామోదర్‌రావు, పార్థసారథి ప్రమాణం నమస్తే తెలంగాణ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ దీవకొండ దామోదర్‌రావు, హెటిరో ఫార్మా వ్యవస్థాపకుడు బండి పార్థసారథిరెడ్డి ఇవాళ రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేశారు. రాజ్యసభ చైర్మెన్ వెంకయ్యనాయుడు సమక్షంలో దామోదర్‌రావు, పార్థసారధిరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఇద్దరు ఎంపీలూ తెలుగు భాషలో ప్రమాణ స్వీకారం చేశారు.
దామోదర్ రావు నేపథ్యం..
జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం మద్దునూరుకు చెందిన దీవకొండ దామోదర్ రావు తెలంగాణ ఉద్యమం ప్రస్థానంలో తొలినాళ్ల నుంచి నేటి ముఖ్యమంత్రి.. నాటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ వెంట నడిచిన వ్యక్తుల్లో ఒకరు. 2001 నుంచి టీఆర్ఎస్ పార్టీలో పలు హోదాల్లో పని చేశారు. పొలిట్ బ్యూరో సభ్యుడిగా, ప్రధాన కార్యదర్శిగా, పార్టీ సెక్రటరీ – ఫైనాన్స్‌గా వ్యవహరించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర మలిదశ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన టీ న్యూస్, నమస్తే తెలంగాణ పత్రికల స్థాపనలో ఆయనది ప్రధాన భూమిక. తెలంగాణకు సొంత మీడియా సంస్థలు ఉండాలని నాటి ఉద్యమ నేత కేసీఆర్‌కు వచ్చిన ఆలోచనలకు అనుగుణంగా రెండు మీడియా సంస్థలను నెలకొల్పడంలో దామోదర్ రావు తన సహకారం అందించారు. తెలంగాణ బ్రాడ్ కాస్టింగ్(టీ న్యూస్ చానెల్)కు తొలి మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరించిన దామోదర్ రావు.. ప్రస్తుతం డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగుతున్న సమయంలోనే తెలంగాణ పబ్లికేషన్స్‌ను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ తలచిన వెంటనే దాని ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. తెలంగాణ పబ్లికేషన్స్(నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దినపత్రికలు) కు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. 1958 ఏప్రిల్ 1న జన్మించిన దామోదర్ రావుకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.
ఫార్మసీ టు పార్లమెంట్..
ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన బండి పార్థసారథిరెడ్డి హెటిరో డ్రగ్స్ వ్యవస్థాపకుడు. వేంసూరు మండలం కందుకూరు గ్రామంలో జన్మించిన పార్థసారథిరెడ్డి కందుకూరులో డిగ్రీ పూర్తి చేసి ఓ ప్రయివేటు కంపెనీలో పని చేస్తూనే హెటిరో సంస్థను స్థాపించారు. తన సంస్థ ద్వారా దాదాపు పది వేల మందికి పైగా ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నారు. స్వగ్రామమైన కందుకూరులో కల్యాణమండపం, సాయిబాబా దేవాలయాన్ని నిర్మించారు. పలు విద్యాసంస్థలు స్థాపించి విద్యావేత్తగా సేవలందిస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని పలు గ్రామాల్లో జరిగే అనేక కార్యక్రమాలకు గుప్తదానాలు చేస్తారని పార్థసారథిరెడ్డికి పేరు ప్రతిష్టలున్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనే పార్థసారథిరెడ్డికి భార్య, కుమారుడు ఉన్నారు.