De-merit Point: ఇంగ్లాండ్ పేస్ బౌలర్ స్టువార్ట్ బ్రాడ్ ను ఐసిసి మందలించింది. ఐసిసి కోడ్ అఫ్ కండక్ట్ 2.9 నిబంధనను అతిక్రమించారని డేవిడ్ బూన్ నేతృత్వంలోని అలైట్ బోర్డు నిర్ధారించింది. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి…. ఇంగ్లాండ్- న్యూజిలాండ్ మధ్య మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ రెండ్రోజుల క్రితం ముగిసింది. నాటింగ్ హామ్ లోని ట్రెంట్ బ్రిడ్జ్ స్టేడియంలో జరిగిన చివరి టెస్టులో న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ ఆడుతోంది. బ్రాడ్ విసిరిన బంతిని కివీస్ ఆటగాడు డెరిల్ మిచెల్ స్ట్రైక్ చేయగా అది బ్రాడ్ చేతుల్లోకే వెళ్ళింది. వెంటనే బ్రాడ్ విసురుగా దాన్ని మిచెల్ వైపు విసిరాడు. ఆ హఠాత్ పరిణామానికి ఖిన్నుడైన మిచెల్ వెంటనే తేరుకున్నాడు. బాల్ కొట్టిన తరువాత బ్యాట్స్ మెన్ రన్ కోసం పరిగెత్తకుండా క్రీజులోనే ఉంటే అతని వైపు బాల్ విసరడం క్రికెట్ నిబంధనలకు విరుద్ధం. దీన్ని పరిగణన లోకి తీసుకున్న మ్యాచ్ అంపైర్లు, థర్డ్, ఫోర్త్ అంపైర్లు రిఫరీకి ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై విచారణ చేసిన ఎలైట్ పానెల్ బ్రాడ్ ను తప్పు బట్టింది.
ఇలా చేసినందుకు మందలింపు, లేదా మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధిస్తారు. అయితే బ్రాడ్ తన తప్పును ఒప్పుకున్నందున మందలింపుతో సరిపెట్టాలని నిర్ణయించింది, ఇకపై ఇలా జరక్కుండా చూసుకోవాలని హెచ్చరించింది. అతనికి డి-మెరిట్ పాయింట్ ఇచ్చింది.
24 నెలలకాలంలో (రెండు క్రికెట్ కాలెండర్ ఇయర్స్)లో నాలుగు కంటేఎక్కువ డి-మెరిట్ పాయింట్లు పొందితే అతన్ని ఓ టెస్టు మ్యాచ్ లేదా రెండు పరిమిత ఓవర్ల మ్యాచ్ లు ఆడకుండా నిషేధం విధిస్తారు. బ్రాడ్ కు ఇది రెండో డి-మెరిట్ పాయింట్.