తెలంగాణ ఉద్యమం బలోపేతానికి మార్గదర్శకుడు, తెలంగాణ జాతిపిత ఫ్రొపెసర్ జయశంకర్, తెలంగాణ కోసం ఆత్మబలిధానం చేసుకున్న శ్రీకాంతాచారిలను అగౌరపరిచేవిధంగా వ్యాఖ్యలు చేసిన పురపాలక శాఖ మంత్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం జగిత్యాలలో వివిధ పార్టీలకు చెందిన 100 మంది ముస్లిం నాయకులుఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ జయశంకర్, శ్రీకాంతా చారీలు ఒక వర్గానికి మాత్రమే చెందినవారు కారని, తెలంగాణ సమాజానికి చెందినవారని అటువంటి మహనీయులను అవమానపర్చడమంటే యావత్ తెలంగాణ ప్రజలను అవమానపర్చినట్లేనని పేర్కొన్నారు. ఉన్నత పదవుల్లో ఉన్న వారు అలోచించి మాట్లాడాలని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. టిఆర్ఎస్ పాలనలో ధనిక వర్గాలకు ప్రాధాన్యత కల్పిస్తూ నిరుపేద వర్గాలకు వివక్షకు గురిచేస్తున్నారని విమర్శించారు.
రెండవసారి అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కరికి కూడ రేషన్ కార్డులు ఇవ్వలేదని, అలాగే ఎలాంటి పింఛన్లు మంజూరు చేయలేదని, ఇందుకేనా మనం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రo తెచ్చుకున్నదని ఆరోపించారు.ప్రత్యేక రాష్ట్రం వస్తే మన బతుకులు బాగుపడుతయనుకుంటే కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని విమర్శించారు.
జగిత్యాల పట్టణంలో ఏ ఒక్కరికైనా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇచ్చారని ప్రశ్నించారు. నూకపెల్లిలో పేదలకు గృహవసతి కల్పించాలని స్థలాన్ని సేకరించి ఒక్కరికి గుంట చొప్పున కాంగ్రెస్ ప్రభుత్వం అందిన్చిందన్నారు. వాటిని కాదని 4 వేల మందికి డబుల్ బెడ్ రూమ్ లు ఇస్తామని నిర్మాణం చేపట్టారని ఇప్పటికి ఒక్కరికి కుడా ఇవ్వకపోవడం పేదలపట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని దీన్ని బట్టి అర్థమౌతోందని తెలిపారు. మన ఊరు – మనబడి కార్యక్రమంలో ఏ పాఠశాలలో కుడా ఎలాంటి పనులు చేపట్టలేదని,బడులు ప్రారంభమై 20 రోజులవుతున్న విద్యార్థులకు డ్రెస్సులు, పుస్తకాలు అందలేదని, ప్రభుత్వ అర్బటమే తప్పా చేసింది శూన్యమని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. మన ఊరు మన బడి కార్యాక్రమం కేవలం నినాదంగానే మిగిలిందని జీవన్ రెడ్డి మండిపడారు.