VP-Nakhvi: భారత ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీయే అభ్యర్ధిగా కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పోటీ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. కొద్ది సేపటి క్రితం కేంద్ర మంత్రి పదవికి ఆయన రాజీనామా చేశారు. నేటి కేబినేట్ఈ సమావేశంలో నఖ్వీ తో పాటు ఆర్సీపీ సింగ్ కూడా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. నఖ్వీ, సింగ్ ల సేవలపై ప్రధాని మోడీ కొనియాడారు.
ఉపరాష్ట్రపతి పదవికి నోటిఫికేషన్ ను కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే విడుదల చేసింది. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కూడా మొదలైంది. అయితే ఇప్పటి వరకూ కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే గానీ, విపక్షాలు గానీ తమ అభ్యర్థులపై స్పష్టత ఇవ్వలేదు.
ముఖ్తార్ అబ్బాస్ ను పోటీకి దించనున్నట్లు గత వారంలో వార్తలు వెలువడినప్పటికీ బిజెపి పెద్దలు ఈ విషయమై ఎలాంటి ప్రకటనా చేయలేదు. రాజ్యసభలో బిజెపి తరఫున డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా కూడా నఖ్వీ వ్యవహరించారు. నేడు ఆయన రాజీనామాతో ఉపరాష్ట్రపతి వార్తలకు బలం చేకూరింది.