Vendetta politics: తెలుగుదేశం పార్టీ నేత, ఉరవకొండ ఎమ్మెల్యే, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ భద్రత కుదించడాన్ని టిడిపి తీవ్రంగా ఖండించింది. నాలుగు రోజుల క్రితం భద్రత పెంచాలని కేశవ్ లేఖ రాస్తే అది పరిగణనలోకి తీసుకోకుండా ఉన్న భద్రతనే తొలగించడం ఏమిటని ప్రశ్నిస్తోంది. పెగాసస్ హౌస్ కమిటీ విచారణపై అనుమానాలు వ్యక్తం చేసినందుకే కేశవ్ కు భద్రత తొలగించారని రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ప్రభుత్వం తీరును సామాజిక మధ్యామాల ద్వారా ఆయన తప్పుబట్టారు.
“పెగాసస్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో ఆధారాలతో సహా ప్రభుత్వాన్ని ఎండగడుతూ, అక్రమాలను ప్రశ్నిస్తున్నారు అని మా పార్టీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు అయిన పయ్యావుల కేశవ్ గారి సెక్యూరిటీని ఉపసంహరిస్తారా? ప్రతీకార రాజకీయాలు చేయటానికా ప్రజలు మీకు పట్టం గట్టింది?
తక్షణమే పయ్యావుల కేశవ్ గారి భద్రతను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నాము. మేము అధికారంలో ఉన్నప్పుడు ఇదే మాదిరిగా వ్యవహరిస్తే జగన్ రెడ్డి పాదయాత్ర చేయగలిగే వారా?” అంటూ ట్వీట్ చేశారు.