నేషనల్ హెరాల్డ్ కేసులో భాగంగా విచారణ కోసం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఎన్ఫోర్స్ మెంట్ దిరేక్టరేట్ తాజాగా మరోమారు సమన్లు జారీ చేసింది. ఈ నెల 21న విచారణకు హాజరుకావాలని ఈడి తేల్చిచెప్పింది. వాస్తవానికి గత నెలలోనే ఈడీ విచారణకు సోనియా గాంధీ హాజరుకావాల్సి ఉంది. కానీ ఆమెకు కొవిడ్ సోకడం, ఆ తర్వాత వచ్చిన అనారోగ్యం కారణంగా విచారణకు వెళ్లలేకపోయారు. విచారణ వాయిదా వేయాలని అమె చేసిన అభ్యర్థనకు అంగీకరించింది. ఈ క్రమంలో జులైలో విచారణకు రావాల్సి ఉంటుందని గత నెలలో వెల్లడించింది. తాజాగా.. తేదీని ప్రకటించింది. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీని తీవ్రంగా విచారించింది ఈడీ. దాదాపు వారం రోజుల పాటు ప్రశ్నల వర్షం కురిపించింది.
బ్రిటీష్ రాజ్యంపై యుద్ధం కోసం 1938లో స్థాపించిన వార్తాపత్రికే ఈ నేషనల్ హెరాల్డ్. నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ.. ఈ పత్రికను ప్రారంభించారు. ఏజేఎల్(అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్).. నేషనల్ హెరాల్డ్ పత్రికలను ప్రచురించేది. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికలో 5వేల మంది స్వాతంత్ర్య సమరయోధులు షేరుహోల్డర్లుగా ఉండేవారు.
స్వాతంత్రం తర్వాత.. నేషనల్ హెరాల్డ్‌ను కాంగ్రెస్ అన్ని విధాలుగా ఉపయోగించుకునేది. అనంతరం.. ఉర్దూ(కౌమి అవాజ్), హిందీ(నవ్‌జీవన్)లోనూ నేషనల్ హెరాల్డ్ ఎదిగింది. దేశానికి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం.. నేషనల్ హెరాల్డ్ ఛైర్మన్ పదవి నుంచి నెహ్రూ తప్పుకున్నారు. క్రమంగా.. దేశంలో నేషనల్ హెరాల్డ్ ఉనికి కోల్పోతూ వచ్చింది. చివరికి 2008లో.. ఈ వార్తాపత్రిక మూతపడింది. అప్పటికే ఆ సంస్థకు రూ. 90.25కోట్ల అప్పులు ఉన్నాయి. అయితే.. అప్పులను తొలగించేందుకు.. కాంగ్రెస్ పార్టీ.. నేషనల్ హెరాల్డ్‌కు రూ. 90.25కోట్లు ఇచ్చింది. అది కూడా రుణ రహిత అప్పులు ఇచ్చింది.
2009లో యూపీఏ మరోమారు అధికారంలోకి వచ్చింది. 2010లో.. యంగ్ ఇండియా పేరుతో దేశంలో ఓ ఎన్జీఓ ఆవిర్భవించింది.
యంగ్ ఇండియాకు.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డైరక్టర్‌గా ఉండేవారు. ఆయనతో పాటు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఇతర నేతలు మోతీలాల్ వోరా, ఆస్కర్ ఫెర్నాండేజ్‌లు షేర్‌హోల్డర్ బాధ్యతలు తీసుకున్నారు. 2010లో ఏజేఎల్‌కు 1,057మంది షేర్హోల్డర్లు ఉండేవారు. 2011లో ఒక్కసారిగా.. ఏజేఎల్‌కు చెందిన అన్ని హోల్డింగ్స్‌ను యంగ్ ఇండియాకు బదిలీ చేసేశారు. ఏజేఎల్.. యంగ్ ఇండియాలో చేరింది. రూ. 90,25కోట్ల రుణం బదులు.. రూ. 50లక్షలను యంగ్ ఇండియాకు చెల్లించింది. ఫలితంగా దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్ హెరాల్డ్ ఆస్తులన్నీ యంగ్ ఇండియా వశమయ్యాయి.