చెట్లను కొట్టివేస్తే మళ్ళీ పెంచవచ్చని, కానీ కొండలను తవ్వేస్తే ఎలా అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ విషయమై హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని తప్పుబట్టిందని గుర్తు చేశారు. వైసీపీ నేతలు రాష్ట్రంలో ఎక్కడికక్కడ కొండలను తవ్వుకుంటూ పోతున్నారని విమర్శించారు. విశాఖ నగరంలో చారిత్రిక రిషి కొండను కనుమరుగు చేయడం బరితెగింపు అంటూ దుయ్యబట్టారు. పర్యావరణ విధ్వంసం చేయడానికి, ప్రకృతి సంపదను దోచుకోడానికి అధికారం ఇవ్వలేదన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 75 శాతం అడవులను నాశనం చేశారని, ఇసుక తవ్వకాలు కూడా ఓ పధ్ధతి ప్రకారం చేయకుండా వాతావరణ సమస్యలకు తెరతీశారని ఆరోపించారు. వ్యక్తులు ముఖ్యం కాదని సమాజమే శాశ్వతమని వ్యాఖ్యానించారు. తన సొంత నియోజకవర్గం కుప్పంలో మైనింగ్ జరిగే ప్రాంతానికి ఎవరినీ రానివ్వకుండా అడ్డుకుంటున్నారని విస్మయం వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి రాగానే అక్రమంగా కొండల్ని తవ్వుతున్న అందరినీ బోనేక్కిస్తామని హెచ్చరించారు. తమ ప్రభుత్వ హయాంలో గ్రీన్ కవర్ పెంచామని, తాను భవిష్యత్ తరాలకోసం ఆలోచించానని చెప్పారు. ఆస్తులు పొతే కష్టపడి తిరిగి సంపాదించుకోవచ్చని, సహజ సంపద నాశనం చేస్తే మళ్ళీ రాదన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ప్రకృతి విలయతాండవం చేస్తే తల్లుకోలేమన్నారు. మైనింగ్ మంత్రే అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నారని, అదేమని ప్రశ్నిస్తున్న తమపై అక్రమ కేసులు పడుతున్నారని పెద్దిరెడ్డినుద్దేశించి విమర్శించారు.