Farmer Friendly: రాష్ట్రంలో వైయస్సార్ ఉచిత పంటల బీమా పధకం కింద ఇప్పటి వరకూ రూ.9వేల 662 కోట్ల రూ.లను చెల్లించామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి వెల్లడించారు. ఈ ప్రభుత్వం అధికారానికి వచ్చాక వ్యవసాయానికి, రైతాంగ సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి అనేక వినూత్న కార్యక్రమాలు, పధకాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలుచేస్తోందన్నారు. అయితే ప్రభుత్వం చేస్తున్న మంచి పనులపై బురదజల్లే లక్ష్యంతో ప్రతిపక్ష నేతలు కొన్నిమీడియా సంస్థలను అడ్డు పెట్టుకుని లేనిపోని ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారన్నారు. వైయస్సార్ ఉచిత పంటల బీమా పధకం కింద రైతులు చెల్లించాల్సిన వాటా, కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వాటా, రాష్ట్ర ప్రభుత్వ వాటా మొత్తం నూరు శాతం ప్రభుత్వమే భరిస్తోందని చెప్పారు.
రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి సకాలంలో నష్ట పరిహారం అందిస్తున్నామని పట్టాదార్ పాస్ పుస్తకం,సిసిఆర్సి కార్డు ఉండి పరిహారం అందని వారు ఎవరినా ఉంటే నిరూపించాలని ప్రతిపక్ష నేతలకు మంత్రి సవాల్ విసిరారు. గత ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ కు 800 కోట్ల రూ.లు బకాయిలు పెట్టివెళ్ళిపోయిందని ఈప్రభుత్వం వచ్చాక 1075కోట్ల రూ.లతో ఈపధకాన్ని తిరిగి ప్రారంభించడం జరిగిందని వ్యవసాయ శాఖామంత్రి కాకాని కోగవర్ధన రెడ్డి వెల్లడించారు.అదే విధంగా ఆయిల్ ఫామ్ రైతులకు 85కోట్ల రూ.లు వెచ్చించి టన్నుకు 600 రూ.లు వంతున అదనపు సాయం అందించడం ద్వారా వారిని అన్నివిధాలా ఆదుకుంటున్నట్టు చెప్పారు.
రాష్ట్రంలో ఇటీవల సంభవించిన భారీ వర్షాల వల్ల ఇప్పటి వరకూ అందిన ప్రాధమిక నివేదిక ప్రకారం 1800 ఎకరాల్లో వరినారు(నారుమడులు)దెబ్బతిన్నట్టు తెలుస్తోందని నష్టం అంచనా వేశామని, ఎన్యుమరేషన్ ప్రక్రియ కొనసాగుతోందని వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్ధన రెడ్డి మీడియాకు వివరించారు. వరినారు(నర్సరీ)దెబ్బతిన్న రైతులకు 85శాతం సబ్సిడీతో వరి విత్తనాలను త్వరలో పంపిణీ చేస్తామని భరోసా ఇచ్చారు.