With People: వాహన మిత్ర లాంటి పథకం దేశంలో ఎక్కడా లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. కరోనా సమయంలో, ప్రభుత్వానికి ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా ఈ పథకాన్ని కొనసాగించామని చెప్పారు . వైఎస్సార్ వాహన మిత్ర పథకం కింద వరుసగా నాలుగో ఏడాది ఆర్ధిక సాయాన్ని విశాఖపట్నంలో జరిగిన ఓ కార్యక్రమంలో లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సిఎం మాట్లాడుతూ ఎవరో కేవలం ‘ఇది నలుగురు ధనికుల కోసం, రెండు పత్రికలూ, మూడు ఛానళ్ళు, ఒక దత్తపుత్రుడు నిలువు దోపిడీ కోసం నడిచిన ప్రభుత్వం కాదు అన్న విషయం గుర్తు పెట్టుకోవాలని కోరుతున్నా’ అని విజ్ఞప్తి చేశారు. ‘మనది పేదల ప్రభుత్వం, ఇది పేదలకు అండగా ఉండే ప్రభుత్వం, ఇది మీ జగనన్న ప్రభుత్వం, ఇది మీ ప్రభుత్వం అన్నది మర్చిపోవద్దు’ అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివిధ సంక్షేమ పథకాల ద్వారా లక్షా 65వేల కోట్ల రూపాయలు ఈ మూడేళ్ళలో లబ్ధిదారుల అకౌంట్లలోకి జమ చేశామన్నారు. కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా చివరకు పార్టీలు కూడా చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పునరుద్ఘాటించారు.
గత ప్రభుత్వం చేసిన అప్పుల కంటే తాము చేస్తున్న అప్పులు తక్కువగానే ఉన్నాయని, కానీ ఆ ప్రభుత్వం చేయలేని సంక్షేమం ఇప్పుడు తాము చేసి చూపిస్తున్నామని చెప్పారు. అప్పుడు ‘దోచుకో- పంచుకో’ అనే సిద్ధాంతం పాటించారని, కానీ ఇప్పుడు దోచుకోవడం, పంచుకోవడం లేదని, నేరుగా అక్కచెల్లెమ్మల కే అందిస్తున్నామని చెప్పారు.
ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను దుష్టచతుష్టయం వక్రీకరిస్తోందని, వీళ్ళ మాదిరిగా తనకు న్యూస్ చానళ్ళు గానీ, దత్తపుత్రుడు గానీ లేవని చెప్పారు. తాను ప్రజలను నమ్ముకునే రాజకీయాలు చేస్తానని, తాను ఆధారపడేది ప్రజల మీద,దయ మీద తప్ప పచ్చ మీడియా, దత్తపుత్రుడిపై కాదని వెల్లడించారు.