భారత పౌరసత్వం వదులుకొని విదేశీ పౌరసత్వం తీసుకోవటం ఇటీవలి కాలంలో ఎక్కువగా జరుగుతోంది. విదేశాలకు వెళ్లి శాశ్వతంగా అక్కడే స్థిరపడుతున్న వారి సంఖ్య అంతకంతకు ఎక్కువవుతోంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం విస్మయం గొల్పే అంశాల్ని వెల్లడించింది. 2021 సంవత్సరంలో అత్యధికంగా 1,63,370 మంది భారత పౌరసత్వం వదులుకున్నారు. వీరిలో అత్యధికంగా 78,284 మంది అమెరికా పౌరసత్వం తీసుకున్నారు. ఆ తర్వాతి స్థానంలో 23,533 ఆస్ట్రేలియా సిటిజెన్ షిప్ తీసుకోగా 21,597 మంది కెనడా పౌరసత్వం స్వీకరించారు. 14,637 మంది యుకె పౌరసత్వం తీసుకున్నారు.
2019 సంవత్సరంలో 1,44,017 మంది భారత పౌరసత్వం వదులుకున్నారు. 2020 లో 85,256 మంది విదేశీ పౌరసత్వాలు తీసుకున్నారు. బిఎస్పి ఎంపి హాజీ ఫజ్లుర్ రెహమాన్ లోక్ సభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ భారత పౌరసత్వం వదులుకున్న వారి వివరాలు వెల్లడించారు. 2019 నుంచి విదేశీ పౌరసత్వాలు తీసుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
గత ఐదేళ్లలో 8 లక్షల మంది భారతీయులు పౌరసత్వం వదులుకున్నారు. 2016 నుండి 2021 వరకు సూమారు 8లక్షల మందికి పైగా భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నట్లు తాజాగా వెలువడిన భారత ప్రభుత్వ అధికారిక డేటా ద్వారా తెలిసింది. ఇక భారత పౌరసత్వం వదులుకున్న 8లక్షలకు పైగా మంది భారతీయుల్లో 2021 డిసెంబర్ వరకు సుమారు 6.10లక్షల మంది విదేశీ పౌరులుగా మారారు. ఇలా విదేశీ పౌరసత్వం తీసుకున్న వారిలో దాదాపు 42శాతం మంది అమెరికా పౌరులుగా మారారు. 2021 మొదటి తొమ్మిది నెలల్లోనే ఏకంగా 50వేల మంది భారతీయులు అమెరికా పౌరసత్వం పొందారు.