శ్రీలంక ప్రజలకంటే ఏపీ ప్రజలకు భరించే శక్తి ఎక్కువగా ఉందని టిడిపి అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. అందుకే రాష్ట్రం అప్పులు, ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయినా ప్రజల్లో ఇంకా పోరాట స్ఫూర్తి రావడం లేదన్నారు. రాష్ట్రంలో కరోనా ఆగిపోయినా సిఎం జగన్ బాదుడే బాదుడు కార్యక్రమం ఆగలేదని, పన్నులతో ప్రజలపై మోయలేని భారం వేస్తున్నారని, ధరలు విపరీతంగా పెరిగాయని విమర్శించారు. దేశంలో ఎక్కువ అప్పులు చేసిన రాష్ట్రం ఆంధ్ర ప్రదేశేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉచిత బియ్యం కూడా ఇక్కడ పంపిణీ చేయడంలేదని, మీరు బియ్యం ఇవ్వకోతే తాము ధాన్యం సేకరణ చేయబోమని కేంద్రం చెప్పడం రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. వరద ముంపు ప్రాంతాల పర్యటనకు బయల్దేరిన చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లా అయోధ్య లంక వద్ద ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ పోలవరం ప్రాజెక్టుపై తాము ప్రత్యేక శ్రద్ధ పెట్టి 72 శాతం పనులు పూర్తి చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టుని రివర్స్ తీసుకు వెళుతున్నారని విమర్శించారు. ముంపు గ్రామాల ప్రజలను పట్టించుకునే వారే లేరని, చివరకు వారిలో తిరుగుబాటు వచ్చే పరిస్థితి నెలకొందన్నారు. స్కూళ్ళ విలీనం పేరుతో 3,4,5 తరగతుల విద్యార్ధులను వేరే స్కూళ్ళకు పంపుతున్నారని, ఈ చర్య టీచర్లను తగ్గించే కుట్రలో భాగమేనని దుయ్యబట్టారు. నాడు-నేడు ఒక నాటకమని, అమ్మ ఒడి ఒక బూటకమని అభివర్ణించారు. గోదావరి జిల్లాలు చైతన్యానికి మారుపేరని, ఇక్కడి ప్రజల్లో చైతన్యం ప్రారంభం కావాలని, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి నాంది ఇక్కడి నుంచే పలకాలని పిలుపు ఇచ్చారు.
Also Read : వ్యతిరేకత వెల్లడైంది: చంద్రబాబు