Friday, November 22, 2024
HomeTrending Newsఫిలిప్పీన్స్ లో భూకంపం...సునామి భయం

ఫిలిప్పీన్స్ లో భూకంపం…సునామి భయం

ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రతకు తీర ప్రాంతాలన్నీ అలజడికి గురయ్యాయి. సముద్రంలో భూకంపం సంభవించడం వల్ల సునామీ వస్తుందనే భయాందోళనలు వ్యక్తమౌతోన్నాయి. దీనికి అనుగుణంగా సునామీ అలర్ట్‌ను జారీ చేశారు అధికారులు. సునామీ సంభవించే ప్రమాదం ఉందంటూ హెచ్చరించారు. భూకంపం ధాటికి పలు భవనాలు బీటలు వారాయి. భయంతో జనం వీధుల్లోకి పరుగులు తీశారు. ప్రాణనష్టం సంభవించినట్లు ఇప్పటివరకు వార్తలు రాలేదు.

ఫిలిప్పీన్స్‌స్‌ ఈశాన్య ప్రాంతంలోని డోలోర్స్‌‌లో ఆ దేశ కాలమానం ప్రకారం.. ఈ రోజు ఉదయం 8:43 నిమిషాలకు ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.1గా నమోదైంది. రాజధాని మనీలాకు ఈశాన్య దిశగా సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న అబ్రా ప్రావిన్స్‌లోని సముద్ర తీర ప్రాంత పట్టణం డోలోర్స్ ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు యునైటెడ్ స్టేట్స్ జియాలాజికల్ సర్వే తెలిపింది. ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతున భూఫలకాల్లో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూకంపం సంభవించినట్లు జియాలాజికల్ సర్వే తెలిపింది. 30 సెకెన్ల పాటు భూమి ప్రకంపించినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. దీని తీవ్రతకు తన భవన కిటికీ అద్దాలు ధ్వంసం అయ్యాయని చెప్పారు.

భూకంప తీవ్రత సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజధాని మనీలాలో సైతం కనిపించిందంటే దాని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. మనీలాలో పలు అపార్ట్‌మెంట్ల కిటికీ అద్దాలు ధ్వంసం అయ్యాయి. అటు డొలొర్స్ వద్ద తీర ప్రాంతంలో అలజడి ఏర్పడింది. సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీర ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. అలలు ఉవ్వెత్తున ఎగిసి పడే ప్రమాదం ఉందని హెచ్చరికలను జారీ చేశారు.

మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ లో కూడా ఈ రోజు భూకంపం సంభవించింది. ఈశాన్య ఆఫ్ఘనిస్తాన్ లోని ఫైజాబాద్ పట్టణానికి 90 కిలోమీటర్ల దూరంలో రిక్టర్ స్కేలుపై 5.6 తీవ్రతతో చోటు చేసుకుంది. ఈ రోజు వేకువ జామున రెండు గంటలకు చోటు చేసుకున్న భూ ప్రకంపనలు పొరుగున పాకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ లను కుడా తాకాయి. మారుమూల ప్రాంతం కావటంతో ప్రాణ, ఆస్థి నష్టం ఇంకా తెలియరాలేదు.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్