కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సోమవారం సెలవు ప్రకటించారు. ఎర్నాకుళంలో, ఆగస్టు 4 వరకు జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన దృష్ట్యా, అన్ని శాఖలను సిద్ధం చేయాలని, మత్స్యకారు లను సముద్రంలోకి వెళ్లవద్దని ఆదేశించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కేరళలో ఆగస్టు 4 వరకు భారీ వర్షాలు ఉన్నాయని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. కొల్లాం, కాయంకుళం, కొచ్చిలోని కొన్ని ప్రాంతాల్లో బలమైన గాలులు వీస్తున్నాయి. దీంతో విద్యుత్, సమాచార వ్యవస్థ తీవ్రంగా ప్రాభావితం అయింది. ఫలితంగా విజింజం ఓడరేవు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే వివిధ జిల్లాల్లో ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు.
భారత వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికల దృష్ట్యా, కొండ ప్రాంతాల్లో ఉన్నవారు అప్ర మత్తంగా ఉండాలని, ముందు జాగ్రత్త చర్యగా వర్ష ప్రభావిత ప్రాంతాల వారిని సహాయక శిబిరాలకు తరలించాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదేశించారు. ఆగస్టు 1న రాష్ట్రంలోని తిరువనంతపురం, కొల్లాం, పతనంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కి జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఆదివారం మధ్యాహ్నం 1 గంటలకు కేరళకు జారీ చేసిన వర్ష సూచన ప్రకారం, ఎనిమిది జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు.
రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరి కల దృష్ట్యా కొట్టాయం, ఎర్నాకులం జిల్లాల్లో క్వారీ, మైనింగ్ కార్యకలాపాలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. కొట్టాయం, జిల్లాలోని ఇల్లిక్కల్ ఇలవీజపూంచిర పర్యాటక కేంద్రాన్ని సందర్శించడానికి వచ్చిన 25 మంది వర్షాలలో ఇరుక్కుపోయారు. ప్రస్తుతం వారిని సమీపంలోని ప్రభుత్వ పాఠశాల, పక్కనే ఉన్న ఇళ్లలో సురక్షితంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాలతో పాటు బలమైన గాలులు వీస్తుండటం ఆందోళన కలిగిస్తోందని రాష్ట్ర రెవెన్యూమంత్రి కే రాజన్ అన్నారు. పతనంతిట్ట జిల్లాలోని వెన్నికులంలో బస్సును ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో కారు వాగులోకి దూసుకెళ్లడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మరణించారు. మరో ఘటనలో పతనం తిట్ట జిల్లాలోని అతిక్కాయం గ్రామంలో 60 ఏళ్ల వృద్ధుడు పంపా నదిలో కొట్టుకుపోయాడు.