ఎనర్జిటిక్ హీరో రామ్, ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రానున్న విషయం తెలిసిందే. అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించడంతో బోయపాటి రెట్టించిన ఉత్సాహంతో ఈ మూవీకి వర్క్ చేస్తున్నారు. ఇక రామ్ ఇటీవల ది వారియర్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ.. ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో ఈసారి ఎలాగైనా సరే.. పెద్ద సక్సెస్ సాధించాలనే పట్టుదలతో ఈ సినిమా చేస్తున్నాడు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతుంది. అఖండ బ్లాక్ బస్టర్ కు మించిన సక్సెస్ సాధించాలని బోయపాటి ఈ కథ పై చాలా గ్రౌండ్ వర్క్ చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ గురించి రెండు ఆసక్తికరమైన విషయాలు ప్రచారంలోకి వచ్చాయి. ఇంతకీ మేటర్ ఏంటంటే.. ఈ సినిమాలో రామ్ ద్వి పాత్రాభినయం చేయబోతున్నాడట. ఆ రెండు పాత్రలు కూడా పూర్తి విభిన్నమైన వేరియేషన్స్ కలిగి ఉంటాయని తెలిసింది.
అంతే కాకుండా ఇది ఒక అడ్వెంచర్ థ్రిల్లర్ అని.. రామ్ కి ఇలాంటి మాస్ యాక్షన్ స్క్రిప్ట్ లు బాగా నప్పుతాయి అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. బోయపాటి స్క్రిప్ట్ కోసం చాలా సమయం కేటాయించడం వల్ల పలు వర్షన్ లను రెడీ చేసి చివరకు ది బెస్ట్ ను ఎంపిక చేశారట. మరి.. రామ్ కి ఆశించిన విజయాన్ని బోయపాటి అందిస్తారో లేదో చూడాలి.