రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారం దక్కించుకుంటుందని తెలంగాణా కాంగ్రెస్ సారధిగా నియమితులైన మల్కాజిగిరి లోక్ సభ సభ్యుడు ఏ. రేవంత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణలో పార్టీకి బలమైన కేడర్ ఉందని, అది చెక్కుచెదరలేదని, రాబోయే రెండేళ్ళు ప్రజాక్షేత్రంలోనే ఉండి, ప్రజల మన్ననలు పొంది ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని అయన ధీమాగా చెప్పారు. బిజెపి- టిఆర్ఎస్ రెండూ వేర్వేరు పార్టీలు కావని, రెండూ ఒకటేనని రేవంత్ స్పష్టం చేశారు. లింగోజిగూడ డివిజన్లో బిజెపి-టిఆర్ఎస్ రెండూ కలిసి పోటీ చేసినా కాంగ్రెస్ గెలిచిందని రేవంత్ గుర్తు చేశారు. తెలంగాణలో ప్రజల పునరేకీకరణ జరగాల్సి ఉందని అయన అభిప్రాయపడ్డారు.
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోనని, అందరినీ కలుపుకుని పోతానని రేవంత్ రెడ్డి వెల్లడించారు. జూలై 7న పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తానని చెప్పారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పాదయాత్ర చేపట్టే ఆలోచనలో ఉన్నానని, అయితే ఈ విషయంలో అదిష్టానం నిర్ణయం తీసుకుంటుందని రేవంత్ అన్నారు.
పార్టీలో అసమ్మతి తాత్కాలికమేనని, కాంగ్రెస్ పార్టీ కుటుంబం లాంటిదని, చిన్న చిన్న అభిప్రాయ బేధాలు సహజమేనని, పార్టీలో సీనియర్లు అందరినీ కలుపుకుని వారి సలహాలు, సంప్రదింపులతోనే కార్యాచరణ ప్రణాళిక ఉంటుందని చెప్పారు.