మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అపాయింట్‌మెంట్ కోరారు. అయితే ఈ నెల 7 వరకు స్పీకర్ అందుబాటులో వుండరని అసెంబ్లీ అధికారులు ఆయనకు వివరించారు. దీంతో ఆగస్ట్ 8న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి రాజీనామా లేఖ సమర్పించనున్నారు. మునుగోడు ఎమ్మెల్యే పదవికి , కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్టుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇది వరకే ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీ తీరుపై చాలా కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆయన కాంగ్రెస్ కు వ్యతిరేకంగా .. బీజేపీకి అనుకూలంగా ప్రకటనలు చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ను ఎదుర్కొనే సత్తా బీజేపీకే ఉందని కూడ రాజగోపాల్ రెడ్డి గతంలో ప్రకటించారు.
మరోవైపు.. మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగితే తమ పట్టును నిలుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ తరుణంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వైపునకు పార్టీ కార్యకర్తలు వెళ్లకుండా కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తోంది.
Also Read : బండి సంజయ్ ను ఎప్పుడు కలవలేదు – కోమటిరెడ్డి వెంకటరెడ్డి