ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం ఇంట్లో ఈ రోజు (శుక్రవారం) ఉదయం సీబీఐ దాడులు చేసింది. గత కొద్ది రోజులుగా ఉచిత పథకాల విషయంలో ఆప్ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. కేజ్రీవాల్ నేరుగా ప్రధానిని టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంట్లో సీబీఐ దాడులు జరిగాయి.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అమలులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై…ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా నివాసంతో సహా ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లోని 20కి పైగా ప్రదేశాలలో ఈ ఉదయం కేంద్ర దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహించింది.
దాడులపై స్పందిస్తూ మంచి పనుల కోసం ఉపక్రమించే వారికి ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని సిబిఐ సోదాలపై మనీష్ సిసోడియా స్పందించారు. ఇలాంటి వ్యవహారాల వల్లే మన దేశం ప్రపంచంలో నంబర్ వన్ స్థానానికి చేరుకోలేకపోతుందని ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఎన్నో కేసులు, ఆరోపణలు చేశారని దేంట్లో కూడా అవినీతి రుజువు చేయలేకపోయారని మనిష్ సిసోడియా తెలిపారు. మనీష్ సిసోడియా నివాసంపై సీబీఐ దాడి నేపథ్యంలో కేజ్రీవాల్ స్పందిస్తూ…”మేము సీబీఐని స్వాగతిస్తున్నాము”అని తెలిపారు.
Also Read : ఈడి వ్యవహారంపై శివసేన, కాంగ్రెస్ ల విమర్శలు