జింబాబ్వేతో జరుగుతోన్న వన్డే సిరీస్ ను ఇండియా కైవసం చేసుకుంది. మూడు మ్యాచ్ సిరీస్ లో భాగంగా మొన్న జరిగిన మొదటి వన్డేలో ఘన విజయం సాధించిన ఇండియా నేడు జరిగిన రెండో దానిలో కూడా ఐదు వికెట్లతో విజయం సాధించి సిరీస్ సొంతం చేసుకుంది. భారత బౌలర్లు సమిష్టిగా రాణించడంతో జింబాబ్వే 161 పరుగులకే కుప్పకూలింది. ఈ లక్ష్యాన్ని ఇండియా 25.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి సాధించింది.
హరారే లోని స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. జింబాబ్వే 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత.. సీన్ విలియమ్స్-42; రియాన్ బర్ల్-39 పరుగులతో రాణించారు. మిగిలిన వారు విఫలం కావడంతో 38.1 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
ఇండియా బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు; సిరాజ్, ప్రసిద్ కృష్ణ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, దీపక్ హుడా తలా ఒక వికెట్ పడగొట్టారు.
ఇండియా కెప్టెన్ కెఎల్ రాహుల్ ఓపెనర్ గా బరిలోకి దిగాడు, అయితే జట్టు స్కోరు 5 వద్ద కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన రాహుల్ ఔటయ్యాడు. శిఖర్ ధాటిగా ఆడి 21 బంతుల్లో నాలుగు ఫోర్లతో 33 పరుగులు చేసి రెండో వికెట్ గా వెనుదిరిగాడు. శుభమన్ గిల్-33 చేయగా, ఇషాన్ కిషన్ విఫలమై కేవలం 6 మాత్రమే చేశాడు. 97 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో ఐదో వికెట్ కు సంజూ శామ్సన్-దీపక్ హుడా 56 పరుగులు జోడించారు. హుడా 25 పరుగులు చేసి ఔట్ కాగా, సంజూ-43, అక్షర్ పటేల్- 6 పరుగులతో నాటౌట్ గా నిలిచి విజయం అందించారు.
సంజూ శామ్సన్ కు ‘మ్యాన్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.
Also Read : తొలి వన్డేలో ఇండియా ఘన విజయం