నారా లోకేష్ ఏం దేశ సేవ చేయడానికి ఇక్కడకు వచ్చారని రాష్ట్ర పశు సంవర్ధకశాఖ మంత్రి డా. సీదిరి అప్పలరాజు ప్రశ్నించారు. గత మూడు రోజులుగా పలాసలో జరుతుతున్న వివాదం, నేటి లోకేష్ పర్యటన ఉద్రిక్తంగా మారడం లాంటి అంశాలపై సీదిరి స్పందించారు.
వైసీపీ నేతలు ఎవరైనా ఆక్రమణలు చేస్తే చెప్పాలని, మిమ్మల్ని కూడా తీసుకెళ్ళి మరీ ఆ ఆక్రమణలు కూల్చి వేస్తామని మంత్రి ఛాలెంజ్ చేశారు. భూములు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు అదే పని తాము చేస్తుంటే అడ్డుకోవడంలో మర్మమేమిటో చెప్పాలన్నారు. ఇప్పడు ఎందుకు ఏడుపులో, ఓవర్ యాక్షన్ ఎందుకు చేస్తున్నారో అర్ధం కావడం లేదని వ్యాఖ్యానించారు.
ఆక్రమణలపై మాట్లాడే అర్హత చంద్రబాబు, లోకేష్ లకు లేదని…. అసలు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు ఎన్టీఆర్ నుంచి ఆక్రమించుకున్నారని, ఆ విషయం లోకేష్ మర్చిపోయినట్లున్నారని విమర్శించారు. మంగళగిరిలో లోకేష్ ఓడిపోయారని, రాబోయే ఎన్నికల్లో కుప్పంలో మత్స్యకారుల చేతిలో చంద్రబాబుకు కూడా ఓటమి తప్పదని అప్పలరాజు జోస్యం చెప్పారు.
పలాస వచ్చి ఛాలెంజ్ చేసి వెళ్తావా.. మరోసారి ట్రై చెయ్ అంటూ లోకేష్ కు ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పలాసలో గత 60 ఏళ్ళలో జరిగిన అభివృద్ధి- ఈ మూడేళ్ళలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు.
Also Read : పోలీసులపై లోకేష్ తీవ్ర ఆగ్రహం