కేంద్ర హోం మంత్రి అమిత్ షా, హీరో జూనియర్ ఎన్టీఆర్ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. వారిద్దరి మధ్యా కేవలం సినిమాలకు సంబంధించిన చర్చ మాత్రమే జరిగిందని చెప్పారు. సీనియర్ ఎన్టీఆర్ గురించి, ఆయన సినిమాల గురించి అమిత్ షా ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారని చెప్పారు. కాగా, కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు కిషన్ రెడ్డి నిరాకరించారు. ఆర్ ఆర్ ఆర్ సినిమా చూసిన తర్వాత కేవలం ఆయన్ను అభినందించేందుకే జూనియర్ ఎన్టీఆర్ ను భోజనానికి ఆహ్వానించారని తెలిపారు.
మన్యం వీరుడు ఆలూరి సీతారామరాజు బ్తొరిటిషు వారిపై తిరుగుబాటు చేసిన తొలి ప్రాంతం రంప ఆందోళనకు వందేళ్ళు పూర్తయిన సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో మన్యం వీరుడి విగ్రహాన్ని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్ ముండాతో కలిసి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం, క్షత్రియ సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర కూడా పాల్గొన్నారు.
బ్రిటిష్ సైన్యానికి చెప్పి మరీ చింతపల్లి పోలీస్ స్టేషన్ పై దాడి చేసి ఆయుధాలు ఎత్తుకెళ్ళారని గుర్తు చేశారు. గిరిజనులకు యుద్ధ విద్యలో నైపుణ్య శిక్షణ ఇచ్చారని, వారిని స్వతంత్ర పోరాటంలో భాగస్వాములను చేశారని చెప్పారు. ఆ సమయంలో అల్లూరికి అండగా నిలిచినా గంటం దొర వారసులు ఇక్కడ నివశిస్తున్నారని, వారికి కేంద్ర ప్రభుత్వం తరఫున ఇళ్లు నిర్మిస్తున్నామని, దానికి నేడు శంఖుస్థాపన చేస్తున్నామని, మళ్ళీ తానే వచ్చి ప్రారంభోత్సవం చేస్తామని భరోసా ఇచ్చారు. అల్లూరి నడయాడిన ప్రదేశాలను పర్యాటకంగా తీర్చి దిద్దుతామన్నారు.
అల్లూరిని కేవలం విశాఖ మన్యం ప్రాంతానికే పరిమితం చేయబోవడం లేదని, హైదరాబాద్ లో, ఢిల్లీ లో కూడా అల్లూరి ఉత్సవాలను జరుపుతామన్నారు. ఇటీవలే గిరిజన బిడ్డ ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికయ్యారని, ఆమెను కూడా అల్లూరి 125వ శత జయంతి ఉత్సవాలకు ఇక్కడకు తీసుకొస్తామని ప్రకటించారు. 75 ఏళ్ళ స్వాతంత్రం తరువాత ఎర్ర కోట నుంచి అల్లూరి పేరును ప్రధాని మోడీ ఎలుగెత్తి చాటారని గుర్తు చేశారు.
Also Read : ఉపయోగం లేకపోతే…: కొడాలి కామెంట్స్