Saturday, November 23, 2024
Homeసినిమాజీవితంలో ప్రతి అనుభవమూ ఒక పాఠమే!

జీవితంలో ప్రతి అనుభవమూ ఒక పాఠమే!

 జీవితంలో ఏ రంగంలో అడుగుపెట్టినా అక్కడ నెగ్గుకురావడం కష్టమే. సినిమా పరిశ్రమలో అయితే మరింత కష్టం. అందుకు  కారణం ఇక్కడ డబ్బు .. పేరు రెండూ కలిసే వస్తాయి. అందువలన ఆ స్థాయిలోనే ఇక్కడ అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. వాటిని దాటుకుని ముందుకు వెళ్లడం ..  అవి అందుకోలేని స్థాయికి ఎదగడమే ప్రధానంగా కనిపిస్తుంది. అలాంటి కష్టాలను అనుభవించినవారిలో అందాల నటుడు శోభన్ బాబు కూడా లేకపోలేదు. ఒకానొక సందర్భంలో ఇండస్ట్రీని వదిలిపెట్టి ఇంటికి బయల్దేరినవారాయన.

శోభన్ బాబు చక్కని కనుముక్కుతీరుతో ఉండేవారు. అందువలన అందరూ కూడా సినిమాల్లో ట్రై చేయమని చెప్పాడంతో,  డిగ్రీ చదువును కాలేజ్ కే వదిలేసి చెన్నై వెళ్లారు. సినిమాల్లో అవకాశాలు సంపాదించడమనేది సినిమాలు చూసినంత తేలిక కాదనే విషయం ఆయనకి అర్థమైంది. ఎన్టీఆర్ .. నాగేశ్వరరావు గురించి తప్ప మరో హీరో గురించి ఆలోచించని మేకర్స్ ను కలిసే సాహసం కూడా ఎవరూ చేయలేని పరిస్థితి. అయినా శోభన్ బాబు గట్టిగానే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. చెన్నై లో ఇల్లు గడవడం కోసం చిన్న చిన్న పాత్రలను చేస్తూ వెళ్లారు.

కృష్ణ హీరో కావడానికీ ..  స్టార్ డమ్ రావడానికి ఎక్కువకాలం పట్టలేదుగానీ, శోభన్ బాబు హీరో కావడానికీ .. స్టార్  డమ్ అందుకోవడానికి పదేళ్లు పట్టింది. సినిమాల్లో హీరోగా నిలదొక్కుకునేంత వరకూ ఆయన పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఆ రోజుల్లో ఆర్ధికంగా ఆయన పడిన ఇబ్బందులే ఆ తరువాత కాలంలో ఆయన డబ్బు విషయంలో జాగ్రత్త పడటానికి కారణమైంది. జీవితంలో అవసరాలు .. ఆపదలు వస్తూనే ఉంటాయి. వాటిని ఎదుర్కోవడానికి అవసరమైన డబ్బు ఉండాలి. ఆ సమయంలో ఎదుటివారి సహాయం కోసం ఎదురుచూసే పరిస్థితి ఉండకూడదనే నిర్ణయానికి ఆయన రావడానికి కారణం కూడా ఆయనకి ఎదురైన అనుభవాలే.

ఒక వైపున ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. మరో వైపున కృష్ణ చెలరేగిపోతున్నప్పుడు, తాను ఏ రూట్లో వెళ్లాలనేది మొదట్లో శోభన్ బాబుకి అర్థం కాలేదు. అర్థమైన తరువాత  ఆయన ఆ రూట్ నుంచి పక్కకి వెళ్లలేదు. ఇద్దరు హీరోయిన్లకి సంబంధించిన కథల్లో రొమాంటిక్ హీరోగా ఆయన చెలరేగిపోయారు. అప్పటి వరకూ ఏ హీరోకి లేడీస్ లో ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉండేది కాదు .. కానీ శోభన్ బాబు వారి నాడీని పట్టేశారు. మహిళా ప్రేక్షకుల ఆదరాభిమానాలను ఆ స్థాయిలో అందుకున్న హీరోలు శోభన్ బాబుకి ముందుగానీ .. ఆ తరువాతగాని లేరనడంలో అతిశయోక్తి లేదు.

ఇక శోభన్ బాబు తాను సంపాదించినదాంట్లో ఎక్కువ మొత్తం స్థలాల కొనుగోలు కోసమే కేటాయించారు. భవిష్యత్తులో  భూముల ధరలు ఆకాశాన్ని అంటుతాయని అప్పట్లోనే అంచనా వేశారు. సొంత సినిమాలు నిర్మించి తోటి నటీనటుల పడుతున్న ఇబ్బందులను చూసిన ఆయన ఆ వైపు వెళ్లలేదు. ఆరోగ్యంగా ఉండటం అందరికీ అవసరమే .. ఆర్టిస్టులకు మరింత అవసరమని గ్రహించి దానిని కాపాడుకుంటూ వచ్చినవారాయన. శోభన్ బాబు జీవితాన్ని  పరిశీలిస్తే క్రమశిక్షణ కలిగిన కథానాయకుడు మాత్రమే కాదు, ముందుచూపున్న మార్గదర్శి కూడా కనిపిస్తారు.

— పెద్దింటి గోపీకృష్ణ

RELATED ARTICLES

Most Popular

న్యూస్