Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్Asia Cup-2022: దాయాదుల పోరులో ఇండియాదే విజయం

Asia Cup-2022: దాయాదుల పోరులో ఇండియాదే విజయం

ఆసియా కప్ లో భాగంగా ఇండియా-పాకిస్తాన్ మధ్య జరిగిన తొలి మ్యాచ్ లో ఇండియా ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. హార్దిక్ పాండ్యా మరోసారి మ్యాచ్ ఫినిషింగ్ లో తన సత్తా ఏమిటో నిరూపించాడు. తొలుత బౌలింగ్ లో రాణించిన ఇండియా… బ్యాటింగ్ లో కొద్దిగా తడబాటుకు గురైనా కోహ్లీ, జడేజా, హార్దిక్ పాండ్యా లు రాణించడంతో  విజయం సాధ్యమైంది. చివరి ఓవర్లో నాలుగో బంతిని సిక్సర్ గా మలిచిన పాండ్యా ఇండియాకు అపూర్వ విజయం అందించాడు.

దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పాకిస్తాన్ జట్టు స్కోరు 15 వద్ద కెప్టెన్ బాబర్ ఆజమ్ (10) భువీ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఫఖర్ జామాన్ కూడా 10 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఇఫ్తికార్ అహ్మద్ 22 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ తో 28 స్కోరు చేసి పెవిలియన్ చేరాడు. ఓపెనర్ రిజ్వాన్ 43 పరుగులతో రాణించాడు. చివర్లో దాహానీ ఆరు బంతుల్లో రెండు సిక్సర్లతో 16 పరుగులు చేసి చివరి వికెట్ గా ఔటయ్యాడు. 19.5 ఓవర్లలో 147 పరుగులకు పాకిస్తాన్ ఆలౌట్ అయ్యింది.

ఇండియా బౌలర్లలో భువీ నాలుగు, హార్దిక్ పాండ్యా మూడు, ఆర్షదీప్ సింగ్ రెండు, ఆవేష్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టారు.

ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ఇండియా ఒక పరుగు వద్ద ఓపెనర్ కెఎల్ రాహుల్  డకౌట్ అయ్యాడు. కెప్టెన్ రోహిత్ శర్మ- విరాట్ కోహ్లీ కలిసి రెండో వికెట్ కు 49 పరుగులు జోడించారు.  మెల్లగా ఆడిన రోహిత్ 18 బంతుల్లో ఒక సిక్సర్ తో 12  పరుగులు చేసి రెండో వికెట్ గా వెనుదిరిగాడు. 34 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ తో 35 పరుగులు చేసిన కోహ్లీ మూడో వికెట్ గా పెవిలియన్ చేరాడు. సూర్య కుమార్ యాదవ్ 18 పరుగులు చేశారు. 29 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 35 పరుగులు చేసిన జడేజా చివరి ఓవర్ తొలి బంతికి బౌల్డ్ అయి వెనుదిరిగాడు. జడేజా- పాండ్యా కలిసి ఐదో వికెట్ కు 52 పరుగులు చేశారు. పాండ్యా 17 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ తో 33 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

మూడు వికెట్లతో పాటు 33పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్