Movie Review: వెండితెరపై ప్రయోగాలకు .. సాహసాలకు విక్రమ్ కేరాఫ్ అడ్రెస్ గా కనిపిస్తారు. సక్సెస్ లు .. ఫ్లాపులు గురించి ఆయన పెద్దగా పట్టించుకున్నట్టుగా కనిపించరు. ఒక మంచి ప్రయత్నం చేశామా లేదా? అనే విషయానికే ప్రాధాన్యతనిస్తున్నట్టుగా అనిపిస్తారు. ఆయన తాజా చిత్రంగా రూపొందిన ‘కోబ్రా‘ సినిమా ఈ బుధవారం థియేటర్లకు వచ్చింది. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించిన ఈ సినిమాకి లలిత్ కుమార్ నిర్మాతగా వ్యవహరించగా, అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించాడు. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమాకి ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చారు.
విక్రమ్ సినిమా అనగానే కథలో ఏదో కొత్తదనం ఉంటుంది .. ఆయన పాత్రలో ఏదో వైవిధ్యం ఉంటుందని అనుకోవడం సహజం. ‘కోబ్రా’ అనగానే యాక్షన్ సీన్స్ ఒక రేంజ్ లో ఉండొచ్చనే అంచనాలు ఉండటం కూడా సహజమే. అసలు ఏఆర్ రెహ్మాన్ ఇప్పుడు ఒక సినిమాను ఒప్పుకోవడమే కష్టంగా ఉంది. అలాంటి ఆయన ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడంటే అది నెక్స్ట్ లెవెల్ కి వెళుతుందనే ఆశ కూడా ఉంటుంది. ఆ ఆశతోనే .. ఆసక్తితోనే పండుగ రోజున థియేటర్లకు జనాలు బాగానే వచ్చారు.
విక్రమ్ నటనకి వంక బెట్టనవసరం లేదు. రెండు విభిన్నమైన పాత్రలలో .. డిఫరెంట్ లుక్స్ తో ఆయన తన స్టైల్ తో ప్రేక్షకులను కూర్చోబెట్టారు. కానీ కథాకథనాల్లో బలం లేకపోవడం .. ఉన్న విషయాన్ని క్లారిటీతో ఇంట్రెస్టింగ్ గా చెప్పలేకపోవడమే ఈ సినిమాలోని ప్రధానమైన లోపంగా కనిపిస్తాయి. తెరపై భారీ సన్నివేశాలు .. అద్భుతమైన విజువల్స్ తో వచ్చిపోతుంటాయి. ఏం జరుగుతోంది? ఎందుకు జరుగుతోంది? అనే క్లారిటీ మాత్రం ఉండదు. తెరపై మాత్రం హడావిడి కొనసాగుతూనే ఉంటుంది.
ప్రధానమైన పాత్రలను డిజైన్ చేయడంలోను .. ఉత్కంఠ భరితమైన ఒక క్లైమాక్స్ ను ఇవ్వడంలోను దర్శకుడు సక్సెస్ కాలేకపోయాడు. ఏఆర్ రెహ్మాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను కొంతవరకూ నిలబెడితే, ఫొటోగ్రఫీ కొంతవరకూ ఆదుకుంది. కొన్ని సన్నివేశాల చిత్రీకరణ బాగానే ఉన్నప్పటికీ, చివరివరకూ ఆడియన్స్ ను మెప్పించడానికి అవి సరిపోవు. ట్యూన్స్ కి తగినట్టుగా .. సందర్భానికి తగినట్టుగా తెలుగు సాహిత్యం లేకపోవడం మరో లోపం. మొత్తంగా చెప్పుకోవాలంటే ఇది విక్రమ్ చేసిన ప్రయోగంగా కాకుండా ప్రయత్నంగానే అనిపిస్తుంది.
Also Read : ‘కోబ్రా’ నా కెరీర్ లో బిగ్ ఛాలెంజింగ్: విక్రమ్