భారీ వరదలతో పాకిస్థాన్ విలవిల్లాడుతోంది. వరదల కారణంగా పాకిస్థాన్‌లో రెండు వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వేలాది ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి. సింద్ రాష్ట్రంలో సింధు నది దాని ఉపనదుల ప్రవాహ ధాటికి సుమారు వంద కిలోమీటర్ల విస్తీర్ణంతో ఏకంగా ఒక సరస్సు ఏర్పడింది. రాష్ట్రంలోని దక్షిణ భాగంలోని నిర్జన ప్రాంతంలో ఇది ఏర్పడటంతో జనజీవనానికి ముప్పు తప్పింది. ఈ మేరకు అమెరికాకు చెందిన నాసా(NASA ) ఉపగ్రహ చిత్రాలను విడుదల చేసింది.భారీ వర్షాలు, వరదల కారణంగా పాకిస్థాన్‌లోని మూడోవంతు భూభాగంలో పంటలు దెబ్బతిన్నాయి. రాబోయే రోజుల్లో కూరగాయలు, పండ్ల కొరత తలెత్తే ప్రమాదం ఉంది. నిత్యావసరాల ధరలు సైతం పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పెరిగిన ధరలతో అల్లాడుతున్న సామాన్య జనానికి ఇది పిడుగులాంటి వార్తే. కాగా వరదల కారణంగా ఆహార సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉండటంతో.. పొరుగు దేశాలై ఇరాన్, అప్ఘానిస్థాన్‌ల నుంచి ఉల్లిపాయలు, టమాటోలు దిగుమతి చేసుకోవాలని పాకిస్థాన్ నిర్ణయించింది. టమాటోలు, ఉల్లిపాయల దిగుమతులపై మూడు నెలలపాటు సుంకాలు ఎత్తివేయాలని ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూను పాకిస్థాన్ జాతీయ ఆహార భద్రతా శాఖ కోరింది. మార్కెట్లో నిత్యవసరాల ధరలు పెరగకుండా చర్యలు తీసుకోవడంపై పాకిస్థాన్ ప్రభుత్వం దృష్టి సారించింది.
‘పొరుగునే ఉన్న భారత్ నుంచి ఆహార పదార్థాలను తీసుకొచ్చేందుకు వీలు కల్పించాలని అంతర్జాతీయ ఏజెన్సీలు పాక్ ప్రభుత్వాన్ని కోరాయి. ఆహార పదార్థాల సరఫరా, కొరతను బట్టి.. మా భాగస్వాములతో చర్చించి, భారత్ నుంచి దిగుమతి చేసుకోవాలా వద్దా అనే విషయమై నిర్ణయం తీసుకుంటాం’ అని పాకిస్థాన్ ఆర్థిక మంత్రి మిఫ్తా ఇస్మాయిల్ ట్వీట్ చేశారు. ఆహార పదార్థాల ధరలు పెరగకుండా ఉండటం కోసం భారత్ నుంచి దిగుమతి చేసుకుంటామని ఇస్మాయిల్ ఈ వారం ఆరంభంలోనే సంకేతాలిచ్చారు. వరదల కారణంగా పంట దిగుబడి తగ్గే అవకాశం ఉండటంతో.. భారత్ నుంచి పంటలను దిగుమతి చేసుకోవాలని భావిస్తోంది. ఇందుకోసం పాకిస్థాన్ సంకీర్ణ సర్కారు భాగస్వామ్య పక్షాలతో సమాలోచనలు జరుపుతోంది.సంక్షోభ సమయంలో పాకిస్తాన్ కు భారత్ ఆపన్న హస్తం అందించటం ద్వారా రెండు దేశాల మధ్య మైత్రి పెంపొందే అవకాశం ఉంది. దీంతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గి.. రెండు దేశాల మధ్య వ్యాపారం బలోపేతం అయ్యే అవకాశం ఉంది. ఇందుకు భారత ప్రభుత్వం చొరవ తీసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. Also Read :పాకిస్తాన్లో వరదల బీభత్సం… లక్షల మంది నిరాశ్రయులు