మన దేశంలోని అత్యుత్తమ తత్వవేత్తలలో ఒకరిగా తనకంటూ విశిష్ట గుర్తింపు పొందిన
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించి ముఖ్యంగా విద్యార్థులు తెలుసుకోవలసిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు…..
1888 సెప్టెంబర్ 5న ఆయన తిరుత్తణిలో సర్వేపల్లి వీరాస్వామి, సీతమ్మ దంపతులకు జన్మించారు. ఈ తిరుత్తణి ప్రాంతం పూర్వపు మద్రాసు ప్రెసిడెన్సీలో ఒక ప్రాంతం. ప్రస్తుతం తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఉంది. వీరి పూర్వీకులు ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా సర్వేపల్లి గ్రామానికి చెందినవారు. తిరుపతి, వేలూరులలో ఉన్న విద్యాలయాలలో చదువుకున్నారు. ఆయన మద్రాసు క్రిస్టియన్ కళాశాల నుంచి తత్వశాస్త్రంలో డిగ్రీని పొందారు.
డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో ఫిలాసఫీ ప్రొఫెసర్ అయ్యారు. అనంతరం మైసూర్ యూనివర్సిటీలో ఫిలాసఫీ ప్రొఫెసరుగా పాఠాలు బోధించారు. ఆయన మైసూరులో ఉన్నప్పుడు నివసించిన బంగళా నిర్మాణానికి వందేళ్ళు దాటాయి. మైసూరు విశ్వవిద్యాలయాన్ని రాధాకృష్ణన్ గారి మనవడు దేశిరాజు కేశవ్ 2014లో సందర్శించినప్పుడు ఆయనకు
మైసూర్ విశ్వవిద్యాలయంలోని కంప్యూటర్ సైన్స్ అధ్యయనాల విభాగాధిపతి ప్రొఫెసర్ జి. హేమంత్ కుమార్ మైసూర్ వర్సిటీ ఆవిష్కరించిన ” తత్వ దర్శన : సర్వేపల్లి రాధాకృష్ణన్ విచారధారే” పుస్తకాన్ని అందజేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శిగా పని చేసిన కేశవ్ అనారోగ్యంతో చెన్నైలోని ఆస్పత్రిలో సెప్టెంబర్ అయిదో తేదీన తుదిశ్వాస విడిచారు. కేశవ్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రం చదివారు.ఆ తర్వాత హార్వర్డ్ జాన్ ఎఫ్ కెన్నెడీ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబిఎ చేశారు. ఉత్తరాఖండ్ క్యాడర్ ఐఎఎస్ అధికారిగా పని చేశారు. ఈయన ఎన్నో పుస్తకాలను రాశారు. వాటిలో ఒకటి గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి జీవితంపై “గిఫ్టెడ్ వాయిస్: ద లైఫ్ అండ్ ఆర్ట్ ఆఫ్ ఎం.ఎస్.సుబ్బలక్ష్మి” !
రాధాకృష్ణన్ గారు సాహిత్యంలో నోబెల్ బహుమతికోసం 16 సార్లు నామినేట్ అయ్యారు. నోబెల్ శాంతి బహుమతికోసం 11 సార్లు నామినేట్ అయ్యారు.
భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను పొందిన రాధాకృష్ణన్ 1952 నుంచి 1962 వరకు పదేళ్ళు ఉపరాష్ట్రపతిగా ఉన్నారు. అనంతరం 1962 నుంచి అయిదేళ్ళు రాష్ట్రపతిగా కొనసాగారు. భారత ఉపరాష్ట్రపతిగా ఉన్న సమయంలో, రాధాకృష్ణన్ రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహించారు. సభలో వాడి వేడిగా చర్చలు జరిగినప్పుడల్లా, సభ్యులను శాంతింపజేయడానికి, సభ సజావుగా కొనసాగడానికి ఆయన సంస్కృత కావ్యాల నుంచి శ్లోకాలను ప్రస్తావించేవారు. అలాగే బైబిల్ నుండి కొన్ని మంచి మాటలను చెప్పేవారు.
1931 నుంచి 1947 వరకు ఈయనను సర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గా పిలిచేవారు. అయితే 1947లో మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌గా సంబోధించడం మొదలుపెట్టారు.
భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత, రాధాకృష్ణన్ యునెస్కో UNESCO (1946-52)లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు.
సోవియట్ యూనియన్‌కు భారత రాయబారిగా పని చేసిన ఈయన రాష్ట్రపతి అయిన తర్వాత, తన పది వేల రూపాయల జీతంలో రెండున్నర వేలు మాత్రమే తీసుకుని మిగిలిన దానిని ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధికి విరాళంగా ఇస్తూవచ్చారు.
1931 నుండి 1936 వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వైన్స్ – ఛాన్సలర్‌గా, 1939 నుండి 1948 వరకు, బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో వైస్ – ఛాన్సలర్‌గా ఉండిన ఈయన ఢిల్లీ యూనివర్శిటీలో, 1953 నుండి 1962 వరకు ఛాన్సలర్‌గా కొనసాగారు.
1921లో, ఆయన కలకత్తా విశ్వవిద్యాలయంలో చేరడానికి మైసూర్ విశ్వవిద్యాలయం నుండి బయలుదేరినప్పుడు విద్యార్థులు మైసూరు రైల్వే స్టేషన్ వరకూ పువ్వులతో అలంకరించిన ఓ ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసి అందులో కూర్చోపెట్టి దారిపొడవునా ఆయన కీర్తిని ప్రశంసిస్తూ ఊరేగింపుగా తీసుకుపోయారు.
1961లో, జర్మన్ బుక్ ట్రేడ్ ఆయనను శాంతి బహుమతితో సమ్మానించింది. మరో రెండేళ్ళకు 1963లో, ఆయన యునైటెడ్ కింగ్‌డమ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్‌లో గౌరవ సభ్యుడయ్యారు.
1975లో కాలధర్మం చెందడానికి కొన్ని నెలల క్రితం ఆయన టెంపుల్టన్ ప్రైజుని అందుకున్నారు. ఈ అవార్డు కింద పొందిన పారితోషికం మొత్తాన్ని ఆయన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి విరాళంగా ఇచ్చేశారు.
1989లో, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ఆయన స్మృత్యర్థం “రాధాకృష్ణన్ స్కాలర్‌షిప్” ను ఏర్పాటు చేసింది.
రవీంద్రనాథ్ ఠాగూర్ తత్వ విధానాన్ని “భారతీయ ఆత్మ యొక్క నిజమైన అభివ్యక్తి”గా విశ్వసిస్తూ ఈయన ‘ది ఫిలాసఫీ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్’ అనే శీర్షికన ఓ పుస్తకం రాశారు.
భారతదేశంలోని వృద్ధులు, వెనుకబడిన వారి కోసం లాభాపేక్షలేని సంస్థ హెల్పేజ్ ఇండియా వ్యవస్థాపకులలో ఒకరుగా ఉండిన రాధాకృష్ణన్ ఉపాధ్యాయులే దేశంలో అత్యుత్తమ మనస్సున్న వారని విశ్వసించేవారు.
1962 నుంచి ఆయన పుట్టినరోజును ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం మొదలైంది.
మద్రాసులోని మైలాపూరులో ఓ వీధికి రాధాకృష్ణన్ శాలై అని నామకరణం చేశారు. ఈ వీధిలోనే ఆయన నివాసముండేది.
– యామిజాల జగదీశ్
Also Read :