Movie Review : బాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో విడుదలకి ముందే అంచనాలు పెంచేసిన సినిమాగా ‘బ్రహ్మాస్త్ర’ కనిపిస్తుంది. కరణ్ జొహార్ నిర్మించిన ఈ సినిమాకి బడా నిర్మాతలు కొందరు భాగస్వాములుగా ఉన్నారు. అంతేకాదు ఒక్క బాలీవుడ్ నుంచే ఈ సినిమా కోసం అమితాబ్ .. షారుక్ .. రణబీర్ కపూర్ వంటి స్టార్ హీరోలు రంగంలోకి దిగారు. ఇక సౌత్ నుంచి బరిలో నాగార్జున దిగారు. ఇక యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న అలియా భట్ ఈ సినిమాలో నాయిక .. రణబీర్ కి జోడీ. పోస్టర్స్ నుంచి ఈ సినిమా అందరిలో ఆసక్తిని పెంచుతూ వచ్చింది.
తెలుగులో ఈ సినిమా ‘బ్రహ్మాస్త్రం‘ టైటిల్ తో ఈ శుక్రవారం ప్రేక్షకులను పలకరించింది. తెలుగు వెర్షన్ ను రాజమౌళి సమర్పించారు. ఈ సినిమా ప్రచార కార్యక్రమాలలో ఆయన పాల్గొనడం వలన, సహజంగానే అంచనాలు పెరుగుతూ వెళ్లాయి. రాజమౌళి ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్నారంటే బలమైన కంటెంట్ ఏదో ఉంటుందనే అంతా అనుకుంటారు. అలా అనుకుని వెళ్లినవారికి నిరాశ తప్పదనే చెప్పాలి. ఈ సినిమాలో ఆర్టిస్టులంతా కూడా హేమాహేమీలే. కానీ వాళ్ల పాత్రలను డిజైన్ చేసిన తీరు మాత్రం అసహనాన్ని .. అసంతృప్తిని కలిగిస్తుంది.
ఇక తెరపై చూస్తుంటే కథ చాలానే ఉన్నట్టుగా అనిపిస్తుందిగానీ .. అందులో క్లారిటీ ఉండదు. ఈ సినిమాలో ఒకచోట హీరో ‘అగ్నితో నాకు అనుబంధం ఉంది’ అంటాడు. మరో చోట ‘అగ్ని అంటే నాకు భయం’ అంటాడు. ఇలా క్లారిటీ లేని సందర్భాలు చాలానే కనిపిస్తాయి. ఒక్కో పాత్రను చాలా పవర్ఫుల్ అన్నట్టుగా అమాంతం పైకి ఎత్తేస్తుంటారు .. అంతలోనే ధడేల్ మంటూ దానిని కిందపడేస్తుంటారు. అక్కడి నుంచి మరో పాత్ర దిశగా కథ ప్రయాణం మొదలు. ఇలా చివరివరకూ కథను తీసుకుని వెళతారు. క్లైమాక్స్ లో కాసేపు గందరగోళం .. తాను ఎందుకు రంగంలోకి దిగింది హీరో మరిచిపోతాడు. బ్రహ్మాస్త్రం కంటే ప్రేమాస్త్రం గొప్పదని వాయిస్ ఓవర్లో చెప్పిస్తాడు.
ప్రపంచాన్ని చీకటి శక్తుల నుంచి రక్షించడానికి రంగంలోకి దిగిన హీరో, లవర్ ను కాపాడుకోవడంతో కథ ముగిసిందంటే అర్థం చేసుకోవచ్చు. ఇక సంగీతం విషయానికి వస్తే చప్పగా అనిపించే ట్యూన్లు, అర్థంకాని సాహిత్యం .. మనసు ఎంతమాత్రం పట్టుకోని మాటలతో కథ నడుస్తుంది. ‘బ్రహ్మాస్త్రం’ను డిజైన్ చేయించిన తీరు ఆకట్టుకోదు. కథలో క్లారిటీ లేదు. ఉన్న కాస్త కథను గ్రాఫిక్స్ డామినేట్ చేసింది. అతకని సన్నివేశాలు .. అవసరం లేని సన్నివేశాలు చాలానే ఉన్నాయి. వాటిని గురించి మాట్లాడుకోకపోవడమే మంచింది.